కృష్ణాజిల్లా : మచిలీపట్నం : కృష్ణా విశ్వవిద్యాలయం : ది డెస్క్ :
విద్యార్దిని, విద్యార్ధులు తమ జూనియర్ ల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అలా కాకుండా ర్యాగింగ్ లాంటి వికృత క్రీడకు పాల్పడితే జీవితం ముగిసినట్లే అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి. రామకృష్ణయ్య పేర్కొన్నారు.
సోమవారం కృష్ణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ర్యాగింగ్, డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా సదస్సులో ఆయన ప్రధానోపాన్యాసం చేశారు.
ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో వైద్య కళాశాలల్లో ప్రారంభమైన ర్యాగింగ్ మన దేశానికి పాకి రాక్షస క్రీడగామారి జీవితాలు ఫణంగా పెట్టే పరిస్థితికి రావడంతో ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చాయన్నారు. అలాగే నేడు మత్తు పదార్థాలు వాడకం వల్ల యువత చెడుమార్గాలు పట్టే ప్రమాదం ఉందని, వాటిని అరికట్టడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం ఎల్ రాణి మాట్లాడుతూ..
కళాశాలల్లో ఫ్రెషర్స్ పార్టీ పేరుతో ర్యాగింగ్ లాంటి వికృత క్రీడ ప్రారంభమవుతుందని, జూనియర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ బాబు మాట్లాడుతూ..
డ్రగ్స్ ను విక్రయించే వారు, కొనుగోలు చేసేవారు ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్ తో పిలుచుకుంటారని అటువంటి వారు తారసపడితే సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల మన శరీరంలోని కేంద్ర నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఇంచార్జి ముసలయ్య తదితరులు ప్రసంగించగా అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.