🔴 కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
మేము ఎవరిమాట వినం…! ప్రజలైనా .. ఏ స్థాయి జిల్లా అధికారులైనా.. ప్రజాప్రతినిదులైనా…! ఇది… జిల్లాలో నేషనల్ హైవే అధికారుల తీరు. ఈమాట ఎందుకంటే.. ?విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి నిర్వహణ లోపాలను సరిదిద్దమని ప్రజా విజ్ఞప్తులు, పత్రికలో కథనాలు, ప్రజాప్రతినిధులు, యంత్రాంగం ఆదేశాలు.. ఇలా ఎన్ని వచ్చినా నేషనల్ హైవే అధికారులలో చలనం లేదు.
నేషనల్ హైవే రోడ్లపై లైట్లు వెలిగించండి.. ప్రమాదాలు నివారించండి : జిల్లా కలెక్టర్ కు జంపాన శ్రీనివాస్ గౌడ్ వినతి
నెలల తరబడి నేషనల్ హైవే పై పలుచోట్ల వీధిలైట్లు వెలగకపోవడం, సర్వీస్ రోడ్ల నిర్వహణ లేకపోవడం వల్ల తరచూ ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్.
గురజాడ నుండి ఉయ్యూరు సర్వీస్ రోడ్లు మార్జిన్ ల నిర్వహణ సరిగా లేదు. ఏడాదిగా వీధిలైట్లు వెలగక పోవడంపై పిర్యాదు.
ఉయ్యూరు నుండి పామర్రు వరకు సర్వీస్ రోడ్ల నిర్వహణ ఇబ్బందులు తొలగించాలని వినతి.

విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి సర్వీసు రోడ్ల నిర్వహణ ఉయ్యూరు నుండి పామర్రు వరకు సరిగా లేదు. పామర్రు, ఉయ్యూరు మధ్యలో గోపువానిపాలెం, గురజాడ గ్రామాల దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ల దగ్గర వీధిలైట్లు గత సంవత్సర కాలంగా వెలగడం లేదు.
గురజాడ నుండి ఉయ్యూరు వరకు సర్వీసు రోడ్ల ప్రక్కన ఉన్న మార్జిన్లు నిర్వహణ సరిగా లేనందున, తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఉయ్యూరు నుండి పామర్రు వరకు సర్వీసు రోడ్ల నిర్వహణ, రోడ్ల మార్జిన్లు మరమ్మత్తులు మరియు వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని యు.ఎఫ్.ఆర్.టి.ఐ.డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ తరుపున యు.ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కో కన్వీనర్, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని యు ఎఫ్ ఆర్ టి ఐ ప్రతినిధుల బృందం సోమవారం మచిలీపట్నంలో కలెక్టరేట్ లో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి వినతి పత్రాన్ని అందించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకునేలా జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరక్టర్ కు ఆదేశాలు జారీ చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీని కోరారు.
తక్షణమే స్పందించిన కలెక్టర్ బాలాజీ :
నేషనల్ హైవే అధికారుల తీరు, ప్రజల అవస్థలు అర్జీ రూపంలో జంపాన శ్రీనివాస్ గౌడ్ అందించిన వెంటనే ..అక్కడికక్కడే కలెక్టర్ బాలాజీ ఫోన్ లో సమస్య పరిష్కారం కోసం నేషనల్ హైవే అధికారులతో మాట్లాడారు.
అవసరమైతే సమస్యను స్వయంగా స్పాట్ కి వచ్చి చూస్తానని కలెక్టర్ బాలాజీ తెలిపారు.కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కార్యకర్తలు బొల్లా శివపార్వతి, మానేపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు.