The Desk…Machilipatnam : కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు మంజూరు

The Desk…Machilipatnam : కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు మంజూరు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS :

జిల్లాలో కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయతర రంగంలో వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాల లక్ష్యాలు సాధించిన ప్రగతి సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత జిల్లా మనది, జిల్లాలో రైతాంగం, ప్రోత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లాలో కౌలు రైతులకు 77 వేలకు పైగా సిసిఆర్సి కార్డులు జారీ చేసినప్పటికీ పంట రుణాలు మంజూరు చాలా తక్కువగా ఉందని, ఎక్కువ మంది కౌలు రైతులుకు పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని, కౌలు రైతులను గుర్తించాలని, ఇప్పటివరకు రుణాలు పొందిన వారి వివరాలతో పాటు, రుణాలు పొందవలసిన కౌలు రైతులు రుణాలు ఎందుకు పొందలేకపోతున్నారో కారణాలు విశ్లేషించాలని అన్నారు. తద్వారా సమస్యలు అధిగమించి కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు మంజూరు చేయడానికి సాధ్యమవుతుందన్నారు.

పంటల భీమా పథకం సమగ్రంగా అమలు చేసేందుకు రైతులు బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న వారందరికీ పంటల భీమా వర్తింపజేసేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. జిల్లాలో కౌలు రైతులకు, చిన్న సన్న కారు రైతులకు, మత్స్యకారులకు, పాడి రైతులకు, గొర్రెల, మేకల పెంపకం దారులకు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. వచ్చే జూన్ జూలై మాసం లోగా జిల్లాలో కనీసం 25 వేల మంది పైగా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వచ్చే సమావేశం నాటికి పశుసంవర్ధక మత్స్య శాఖ అధికారులు ఎంతమందికి రుణాలు మంజూరు చేయించారో సమావేశంలో వివరించాలన్నారు.

బాగా చదువుకుని తెలివితేటలు గలవారిని గుర్తించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక(ఎమ్మెస్ ఎం ఈ) కింద యూనిట్లు మంజూరుచేసి, బ్యాంకులు విరివిగా రుణాల మంజూరు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు కృషి చేయాలన్నారు.ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం కింద వివిధ బ్యాంకుల వద్ద పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలన్నారు.

ఏడాదిన్నరలో బందరు పోర్టు రానున్నదని, తద్వారా ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ లు, గోడౌన్స్ వంటివి ఎక్కువగా వస్తాయని, రుణాలు డిమాండ్ బాగా పెరుగుతుందని, కంటైనర్స్ ఎక్కువగా వస్తాయని, సంబంధించిన వాహనాలకు కూడా డిమాండ్ ఉంటుందని, పారిశ్రామిక వాడలు వచ్చే అవకాశం ఉందని, ఎగుమతులు దిగుమతులకు ఎంతో అవకాశం ఉంటుందని, కావున విశాఖ, కృష్ణపట్నం వోడరేవులకు వెళ్లి అధికారులు అధ్యయనం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు ఎంపీ సూచించారుసమావేశానికి కొన్ని బ్యాంకుల నియంత్రణ అధికారులు రాకపోవడం పట్ల జిల్లా కలెక్టర్, పార్లమెంటు సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ, బ్యాంకర్ల సమావేశానికి అన్ని బ్యాంకుల నియంత్రణ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

జిల్లాలో వివిధ పంటల విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలు, రైతులకు సాగు వ్యయం అంశాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఎకరాకు మంజూరు చేసే పంట రుణ మొత్తాలు (scale of finance) స్టేట్ కమిటీకి నివేదించే నిమిత్తం కమిటీలో చర్చించారు.అనంతరం రిజర్వ్ బ్యాంకు సైబర్ ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్, బందరు పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశంలో విడుదల చేశారు.

ఈ సమావేశంలో ఎల్డిఎం సి రవీంద్రారెడ్డి, ఆర్బిఐ ఎల్ డి ఓ నవీన్ కుమార్, నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ మిలింద్ చోసాల్కర్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం. రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉప ప్రాంతీయ నిర్వహణ అధికారి తాతాజీ, జడ్పీ సీఈవో కె కన్నమ నాయుడు, జిల్లా జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ఆర్ .వెంకట్రావు, టిడ్కో పిడి బి. చిన్నోడు, ఉద్యాన శాఖ అధికారి జే జ్యోతి, వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులు పాల్గొన్నారు.