కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉధృతి పట్ల జిల్లాలోని నది పరివాహక ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో వరద పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజ్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 2.87 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని, ఇది రేపటికి 3.97 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరద నీటిని బ్యారేజీ దిగువకు వదలడం జరిగిందని, ఇప్పటికే మొదటి స్థాయి ప్రమాద హెచ్చరిక జారీచేయడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 20వ తేదీకల్లా వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జల వనరులు, రెవిన్యూ, పోలీసు, రవాణా, మత్స్యశాఖ, పంచాయతీ రాజ్, రహదారులు భవనాలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
సచివాలయ సిబ్బంది ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలలోని గ్రామాలలో దండోర వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎక్కడైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.,
ఈ టెలికాన్ కాన్ఫరెన్స్లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.