కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) కమిటీలోని అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించే విధంగా వాహన చోదకులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించే విధంగా పోలీసులు చూడాలని, అది పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
2025 ఏప్రిల్ నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 64 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, వాటిలో 33 మరణాలు, 71 మంది గాయాలపాలయ్యారని, అత్యధికంగా జాతీయ రహదారులపై 23, రాష్ట్ర రహదారులు 3, ఇతర రహదారులపై 7 మరణాలు సంభవించినట్లు అధికారులు వివరించారు.జంక్షన్లు, హైవే నుండి సర్వీస్ రోడ్లు వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందజేసి మరణాల సంఖ్య తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో జిల్లా రవాణా అధికారి బి ఎస్ ఎస్ నాయక్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేష్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్, వైద్య ఆరోగ్య, జాతీయ, రాష్ట్ర రహదారులు, ఏపీఎస్ఆర్టీసీ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.