- బీచ్ ఉత్సవాల నేపథ్యంలో పనులు, ఏర్పాట్లపై అధికారులకు మంత్రి కొల్లు దిశా నిర్దేశం
- కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ నిధులతో రిసార్ట్లు, హోటళ్ల కోసం స్థలాలు కేటాయింపు జాతీయ క్రీడలు కయా కింగ్, బీచ్ కబడి పోటీలు నిర్వహణకు కేంద్రం అనుమతి
- వచ్చే మే నెల 15 నుండి 3 రోజుల పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించనున్న బీచ్ ఉత్సవాలు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
ఘనమైన బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తామని, మంగన పూడి బీచ్ను అన్ని విధాల అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం మంత్రి, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్ ను సందర్శించారు. వచ్చే మే నెలలో నిర్వహించనున్న బీచ్ ఉత్సవాల నేపథ్యంలో రేఖా చిత్రపటం పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనులు, ఏర్పాట్ల గురించి మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మన రాష్ట్రానికి 980 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉందని, మంగినపూడి బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాదుకు మంగినపూడి బీచ్ చాలా దగ్గరలో ఉందన్నారు.బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు.
ఇందుకోసం బీచ్ లో 150 ఎకరాలను గుర్తించామని, ఇంకనూ మరో 200 నుంచి 300 ఎకరాలు కూడా గుర్తించే పనులు జరుగుతున్నాయని, అక్కడ కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ నిధులతో రిసార్ట్లు, హోటళ్ల కోసం స్థలాలు కూడా కేటాయిస్తామన్నారు. తద్వారా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయన్నారు.
తమ ప్రభుత్వం 2018 లో మంగినపూడి బీచ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిందని, సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు ప్రదర్శనశాలలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశామన్నారు.బీచ్ కు పూర్వవైభవం తీసుకొచ్చి ఈసారి ఉత్సవాలను అందరినీ ఆకట్టుకునే విధంగా మరింత ఘనంగా నిర్వహించి ప్రజలకు కొత్త అనుభూతిని కల్పిస్తామన్నారు. ఈసారి ఉత్సవాలలో జాతీయ క్రీడలు కయా కింగ్, బీచ్ కబడి పోటీలు నిర్వహించేందుకు అనుమతి వచ్చిందన్నారు.
ఈ వేసవికాలంలో వచ్చే మే నెల 15వ తేదీ నుండి3 రోజుల పాటు విద్యార్థులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట మెప్మా పిడి సాయిబాబా, రహదారులు భవనాల డి ఈ సంగీత, తహసిల్దారు నాగభూషణం, మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ చంద్రబోస్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.