- వచ్చే మే 15వ తేదీ నుంచి బీచ్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
- బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ
- వచ్చే శీతాకాలానికి బీచ్ ను అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ను అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.గురువారం రాత్రి మంత్రివర్యులు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ లతో కలిసి మంగినపూడి బీచ్ ను పరిశీలించారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణ గమనించిన ముఖ్య కార్యదర్శి బీచ్ అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మంగినపూడి బీచ్ అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు, భీమవరం, రేపల్లె, గుంటూరు తదితర ప్రాంతాలకు మంగినపూడి బీచ్ దగ్గరగా ఉందన్నారు.
ఈ బీచ్ సురక్షితమైనదే కాకుండా ఇక్కడ 200 ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉందని, అందులో ఇప్పటికే 150 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. మిగిలిన 50 ఎకరాల భూమిని కూడా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా మంగినపూడి బీచ్ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ బీచ్ ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్క.డ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పి పి పి పద్ధతిలో స్వదేశీ దర్శన్ పథకం కింద బీచ్ లో రిసార్టులు, హోటల్లు, తదితర అభివృద్ధి పనులు చేపట్టుటకు 108 నుంచి 150 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆ మేరకు సమగ్ర ప్రణాళికతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేశామన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో 2018 సంవత్సరం జూన్లో మంగినపూడి బీచ్ ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించామని, 10 లక్షల మంది జనాభా వచ్చారని, హెలికాప్టర్, ప్యారా గ్లైడింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశామన్నారు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం బీచ్ ఉత్సవాలను నిర్వహించలేదని.. మరల తాము వచ్చే మే 15వ తేదీ నుంచి బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నానున్నారు. కియా కింగ్, బీచ్ కబడ్డీ జాతీయ క్రీడలను కూడా ఈసారి మంగినపూడి బీచ్ లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి సంవత్సరము 20% వృద్ధి, ఉపాధి అవకాశాలు పర్యాటక రంగంలో లభించే అవకాశం ఉందన్నారు. మతసంబంధంగాను, బీచ్ల అభివృద్ధి పరంగా పర్యాటక రంగం బాగా జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందనీ, 9 బీచ్లను గుర్తించామని, అందులో సూర్యలంక బీచ్ లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు.
రెండవ బీచ్గా మంగినపూడి బీచ్ ను అభివృద్ధి పరుస్తామని, హైదరాబాదు, నరసాపురం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని, మంచి ఆదాయం వచ్చే సామర్థ్యం గల ప్రదేశం అని, ముఖ్యంగా వారాంతపు సెలవుల్లో ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తున్నారన్నారు. ఈ బీచ్ లో రాత్రిపూట కూడా ఉండేందుకు వీలుగా రిసార్టులు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు విశ్రాంతి గదులు తదితర కనీస సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. అలాగే జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తానన్నారు.
ఇందుకోసం కనీసం100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకం 2.0 లో నుండి నిధులు సమకూర్చుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిపిపి పద్ధతిలో ఒరిస్సా రాష్ట్రంలో టెంట్లు సెట్లు మౌలిక సదుపాయాలు తాత్కాలికంగా 45 నుంచి 60 రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, అదే తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే శీతాకాలానికి బీచ్ ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ…
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు కొలు రవీంద్ర నేతృత్వంలో మంగినపూడి బీచ్ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ బీచ్ కు మంచి ఆదాయం లభించే సామర్థ్యం ఉందన్నారు. విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాలకు బీచ్ చాలా దగ్గరగా ఉందన్నారు. ఈ బీచ్ ను సందర్శించే పర్యాటకులకు మంచి అనుభూతి కలిగే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు.
పర్యటనలో మంత్రి, ప్రత్యేక కార్యదర్శి, జిల్లా కలెక్టర్ వెంట పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు వై.వి.ప్రసన్నలక్ష్మీ, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఆర్డిఓ స్వాతి, ఏపీపీఎఫ్సీఎస్ చీఫ్ కన్సల్టెంట్ కె. లక్ష్మీనారాయణ, ఆర్కిటెక్ట్ మధు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణ రావు, తహసిల్దారు నాగభూషణం తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.