The Desk…Machilipatnam :  26 లోగా శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి : వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : 26 లోగా శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి : వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈనెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సి ఎఫ్ ఎం ఎస్ గుర్తింపు సంఖ్య కలిగిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆన్లైన్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో కర్మయోగి భారత్ ధ్రువీకరణ పత్రం పొందాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

మొదట్లో సీనియర్ అధికారులు మాత్రమే కర్మయోగి శిక్షణ పొందారని, తాను కూడా ఇదివరకే శిక్షణ పొందానని, ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన సేవలందించేందుకు ఉద్యోగులందరూ శిక్షణ పొందాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు.ఈ విషయమై ప్రతి జిల్లా అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరి చేత ఈనెల 26వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ శిక్షణలో మూడు కోర్సులు ఉంటాయని, అందులో ఒకటి హార్ట్ ఇన్ గవర్నెన్స్ , రెండవది కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, మూడవది ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ కోర్సులు ఉన్నాయన్నారు ఈ మూడు కోర్సులకు సంబంధించిన 3 వీడియోలు మొదట నుండి చివరి వరకు చూసిన తర్వాత వారు అడిగే ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పిన ఎడల ఒక ధ్రువీకరణ పత్రం విడుదలవుతుందన్నారు.

ఒక్కొక్క వీడియో 20 నిమిషాల పాటు ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి తొలుత ఐ గాట్ కర్మ యోగి భారత్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, అందులో సి ఎఫ్ ఎం ఎస్ ఐ డితో అనుసంధానమైన సెల్ ఫోన్ నంబర్తో లాగిన్ ఐ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్నారని ఆలోగా అందరూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీనియర్ సలహాదారు వెంకటేశ్వర స్వామి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.