The Desk… Machilipatnam : కలెక్టరేట్ పరిధిలో ప్లాస్టిక్ నీటి సీసాల వాడకం నిషేధం :  జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk… Machilipatnam : కలెక్టరేట్ పరిధిలో ప్లాస్టిక్ నీటి సీసాల వాడకం నిషేధం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ప్లాస్టిక్ నీటి సీసాల వాడకం నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం నియంత్రణ, ప్లాస్టిక్ నీటి సీసాల వాడకం నిషేధంపై గట్టి నిర్ణయం తీసుకొని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల వరకు ప్రతి మూడవ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని మెరుగ్గా ఉంచుకోవాలనే సదాశయంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో నెల ఒక ఉద్దేశంతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల వీలైనంత వరకు కలెక్టరేట్ పరిధిలో ప్లాస్టిక్ నీళ్ల సీసాల వాడకం లేకుండా చెత్తాచెదారం పేరుకోకుండా నివారించుటకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా జిల్లా అధికారులతో పాటు సిబ్బందికి ఒక స్టీల్ నీళ్ల సీసా, ఒక గుడ్డ సంచి పంపిణీ చేశామన్నారు.

ఇకపై కలెక్టరేట్లో జరిగే అన్ని సమావేశాల్లో ప్లాస్టిక్ నీటి సీసాలను ఇవ్వడం జరగదని ఎవరికి వారు తప్పనిసరిగా వారి వద్ద ఉన్న స్టీల్ సీసాలలో నీరు తీసుకొని రావాలని కలెక్టరేట్లో ఉన్న ఆర్వో ప్లాంట్ నుండి అవసరమైతే మరల నీరు పట్టుకోవాలని సూచించారు. గతంలో 15 సంవత్సరాల కిందట ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు గుడ్డ సంచులు తీసుకొని వచ్చే వారని అది మరలా పునరావృతం చేసుకోవాలన్నారు. మచిలీపట్నం నగరంలో రోజుకు 80 టన్నుల చెత్త తయారవుతుందని అందులో 32 నుంచి 36% చెత్త ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులే ఉన్నాయన్నారు.

ప్లాస్టిక్ నీటి సీసాల వాడకం చిత్తశుద్ధితో ఆపగలిగితే చాలావరకు ప్లాస్టిక్ చెత్తను నియంత్రించవచ్చన్నారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి అమలుకు సహకరించాలన్నారు.జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు కలెక్టరేట్ ప్రాంగణంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బందికి స్టీల్ నీటి సీసాలను పంపిణీ చేశారు.

తదనంతరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ బ్యాగులు వద్దు-జ్యూట్ బ్యాగులు ముద్దు, ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తాం- పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ నిషేధిస్తాం-భావితరాలను కాపాడుతాం అని పెద్ద ఎత్తున నినాదాలతో రహదారులు భవనాల అతిథిగృహం వద్ద గల మహాత్మా గాంధీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి.. అక్కడ మానవహారం ఏర్పాటు చేయించి మరల అందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు కేఆర్ఆర్సి ఎస్డిసి శ్రీదేవి జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్ డ్వామా, డి ఆర్ డి ఏ పిడిలు శివప్రసాద్, హరిహరనాథ్, మచిలీపట్నం ఆర్డీవో స్వాతిడిపిఓ అరుణ, డి టి డబ్ల్యూ ఓ ధూర్జటి ఫణి,వయోజన విద్య ఉపసంచాలకులు బేగ్, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, సిపిఓ గణేష్ కృష్ణ, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబు, ఏపిఎంఐపి పిడి విజయలక్ష్మి గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకటరావు తదితర జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.