The Desk … Machilipatnam : బాలల సంక్షేమ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk … Machilipatnam : బాలల సంక్షేమ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం: ది డెస్క్ :

బాలల సంక్షేమం, సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, కమిటీ సభ్యులతో కలిసి ఆయన బాలల సంరక్షణ, బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, బాలల సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంక్షేమం, సంరక్షణ కోసం ప్రభుత్వం పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి కఠిన చట్టాలను అమలు చేస్తోందన్నారు. జిల్లా స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు, బాలల సంక్షేమ కమిటీలు (సీడబ్ల్యూసీ), జువెనైల్ జస్టిస్ బోర్డులు (జేజేబీ) ఏర్పాటు చేసి బాలల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. దీనిపై జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాల నిషేధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వారి పరిధిలో జరిగే బాల్య వివాహాలపై నిత్యం అప్రమత్తంగా ఉండే విధంగా గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడి కార్యకర్తలు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

ఆధార్ కార్డులు లేని జిల్లాలోని 23 మంది అనాధ పిల్లలకు తక్షణమే మంజూరు చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత తహసిల్దార్లను సంప్రదించాలని సిడిపిఓ లకు సూచించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న పిల్లల సంరక్షణ కేంద్రాల వద్ద నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని, పరిసర ప్రాంతాలలో మందుబాబుల ఆగడాలు, ఇతర సమస్యలు తలెత్తినా వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పిల్లలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాల సమాచారంపై తక్షణం స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, విద్యాశాఖ ఏడి ఎం విద్యాలత, జెడ్పి సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి రవికాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు ప్రశాంతి, మధుబాబు, డీసీపీఓ కిషోర్, సీఐ వెంకటేశ్వరరావు, సిడిపిఓలు, డిసిపియు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, వాసవ్య మహిళా మండలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎం దివ్య, సిహెచ్ ఉషారాణి, సిహెచ్ శాంతి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.