కృష్ణాజిల్లా : కృత్తివెన్ను : ది డెస్క్ :

అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహించినా, అనుమతులు పొంది తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి హెచ్చరించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కృత్తివెన్ను మండలంలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. మండలంలోని పడతడిక, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలలో బాణసంచా తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రాలలో సరైన లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్, నిల్వ పరిమితులు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు.
షెడ్లలో పరిమితికి మించి పేలుడు పదార్థాలు నిల్వ చేయకుండా చూడటం, మిక్సింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్ ఎండబెట్టే విభాగాలు నిబంధనల ప్రకారం నిర్ణీత దూరంలో ఉన్నాయా లేదా అని, అదేవిధంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎర్తింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించారు.
శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకార్మికులు ఉన్నారా తదితర వివరాలను ఆరా తీశారు.
అగ్నిమాపక పరికరాల లభ్యత, ఎగ్జిట్ పాయింట్లు, పొగతాగడంపై నిషేధం వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. కూలీల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని చెబుతూ.. బాణసంచా తయారీలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్ల నియమించుకోవద్దని హెచ్చరించారు.
బందరు ఆర్డీవో కే సాంబశివరావు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఏసురత్నం, తహసిల్దారు శశి కుమార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

