కృష్ణాజిల్లా ::మచిలీపట్నం : ది డెస్క్ :
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి భవనాలను తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని కృష్ణా జిల్లా బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లాడుతూ.. సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో రోగులతో పాటు వచ్చిన వారి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విశ్రాంతి కోసం రోటరీ క్లబ్, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రూ.20 లక్షల నిధులతో విశ్రాంతి భవనాలను నిర్మించారని తెలిపారు. అయితే ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఈ భవనాలను ప్రస్తుతం ఆస్పత్రి యూనియన్, రక్త పరీక్షల కోసం వినియోగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో రోగులతో వచ్చిన బంధువులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన స్థలం లేక చెట్ల కింద, రోడ్ల పక్కన గడపాల్సిన పరిస్థితి నెలకొన్నదని వివరించారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఈ భవనాలను తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని బి.సి సంక్షేమ సంఘం తరఫున జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, భోగిరెడ్డి సుభాని, సి.హెచ్. కోటేశ్వరరావు, ఎం. పవన్ తదితర బి.సి నాయకులు పాల్గొన్నారు.

