The Desk … Machilipatnam : డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం ఎంతో సులువు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk … Machilipatnam : డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం ఎంతో సులువు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

డ్రోన్ ల సాంకేతిక పరిజ్ఞానంతో పొలాల్లో విత్తనాలు విత్తడం ఎంతో సులువు, ప్రయోజనకరం అని, ఆ దిశగా రైతులు అవకాశాలను అందిపుచ్చుకొని లబ్ది పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు.

శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ మండల వ్యవసాయ అధికారులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులకు డ్రోన్ల వినియోగంపై నిర్వహించిన కార్యశాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రుతుపవన వర్షాలకు ముందు (ప్రీ మాన్‌సూన్ డ్రై సీడింగ్ – పీఎండీఎస్) పొడి నేలలో 30 నుంచి 32 రకాల మిశ్రమ విత్తనాలను పొలంలో చల్లేందుకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపకరిస్తుందని, దీనివల్ల సమయం ఆదాతో పాటు కూలీల కొరతను అధిగమించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే గన్నవరం మండలం, వీరప్పనేనిగూడెంలో ప్రయోగాత్మకంగా చేపట్టామని వివరిస్తూ దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పొలంలో మొలిచిన మొక్కలను కొంత కాలానికి భూమిలో కలియ దున్నడం ద్వారా నేల సారవంతంగా మారి, ఎరువుల వినియోగం తగ్గుతుందన్నారు. రైతు సేవ కేంద్రాల వారీగా ఆసక్తిగల రైతులను గుర్తించి విస్తీర్ణం ఆధారంగా అవసరమైన విత్తన నిల్వలను ఉంచాలని సూచించారు.

కార్యక్రమంలో గుంటూరు జిల్లా రీజినల్ అగ్రికల్చర్ రిసర్చ్ స్టేషన్ వ్యవసాయ శాస్త్రవేత్త సాంబయ్య డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎన్ పద్మావతి, జె జ్యోతి, ప్రకృతి వ్యవసాయం డిపిఎం పార్థసారథి, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి సుధారాణి, ఏడి మణిధర్, మండల వ్యవసాయ అధికారులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులు, డ్రోన్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
………………………….