కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్రమైన సవరణ కార్యక్రమం పై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్రమైన సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్) జరుగుతోందన్నారు. 2002 తీవ్ర సవరణ కార్యక్రమంతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ జరుగుతుందని, ఇప్పటివరకు దాదాపు 58 శాతం పూర్తయిందని వివరించారు.
జిల్లాలో 6,7, 8 ఫారాలకు సంబంధించి మొత్తం 61,521 క్లేయుములు రాగా అందులో 48,068 పరిష్కరించడం జరిగిందన్నారు. గతంలో 1769 పోలింగ్ కేంద్రాలు ఉండగా అదనంగా 73 కేంద్రాలు కలుపుకొని మొత్తం 1842 పోలింగ్ కేంద్రాలు ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ప్రతిపాదించి ఉన్నామన్నారు.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారి తరఫున బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలన్నారు. వారు తప్పనిసరిగా ఆ ప్రాంతాలకు చెందిన స్థానికులై ఉండాలన్నారు
బూతు స్థాయి అధికారులు ఇంటింటి ఓటర్ల పరిశీలన జరిపినప్పుడు ఎటువంటి అవకతవకలు జరగకుండా బూత్ స్థాయి ఏజెంట్లు ఉంటే నివారించవచ్చన్నారు. బూతు సాయి ఏజెంట్ల నియామకం జరగకపోతే ఒకవేళ తప్పు జరిగిన ఫిర్యాదు చేసే హక్కు కోల్పోతారన్నారు.
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో బూతు స్థాయి ఏజెంట్లను రాజకీయ పార్టీలు నియమించుకోవాలని స్పష్టం చేసిందన్నారు. ఓటర్ల జాబితాలో అనర్హులు ఉండరాదని, అలాగే స్థానికులు కాకుండా బయట వ్యక్తులు కూడా ఉండరాదన్నారు.
టిడిపి ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ శాతం తక్కువ అయిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను పరిశీలిస్తే అక్కడ ఓటర్లు వలసలు కానీ చనిపోవడం గాని గుర్తించవచ్చన్నారు. సిపిఎం ప్రతినిధి కొడాలి శర్మ మాట్లాడుతూ చనిపోయిన వారి సంఖ్య కంటే తొలగించిన వారి ఓట్లు ఎక్కువ ఉండకుండా చూడాలన్నారు.
సమావేశంలో టిడిపి, బిజెపి, బీఎస్పీ, వైసిపి, సిపిఎం ప్రతినిధులు దిలీప్ కుమార్, బత్తిన దాస్, పంతం వెంకట గజేంద్రరావు, బాలాజీ, సిలార్ దాదా, కొడాలి శర్మ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

