కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్ నుండి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఫైర్, లేబర్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయన్నారు. గ్రామాలు పట్టణాలు, నగరపాలక సంస్థ పరిధిలో మసీదుల వద్ద పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెల్లవారుజామునే ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లి నమాజ్ జరుపుకుంటారని ఆ సమయంలో విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రార్థన సమయానికి ముందే నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకుండా మసీదుల వద్ద విద్యుత్తు లైనులను తనిఖీ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మసీదుల వద్ద శాంతి భద్రతలను పర్యవేక్షించాలన్నారు.
నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఆహార సామాగ్రి కొనుగోలు చేయడానికి దుకాణాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, అడిషనల్ ఎస్పీ వి.వి నాయుడు ఉన్నారు.