కృష్ణాజిల్లా : మచిలీపట్నం/గూడూరు : ది డెస్క్ :
రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిసారించాలని, పాడి ఆవులతో పాలు అమ్మకాలు జరపడంతో పాటు గోమయం, గోమూత్రంతో కూడా వివిధ రకాల పూజా సామాగ్రిని తయారుచేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎస్ హెచ్ జి మహిళలకు పిలుపునిచ్చారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా గూడూరు మండలంలోని పినగూడూరు లంకలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అభ్యుదయ రైతు మేకపోతుల విజయ రామ్ గురూజీ నేతృత్వంలోనీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ సౌభాగ్యం ఆహార నమూనాను పరిశీలించి విజయరామ్ ను అభినందించారు. అక్కడ సోలార్ డ్రైయర్లుపై ఆరబెట్టిన మునగాకు, గోమయంతో చేసిన దూప్స్టిక్స్, పిడకలు వగైరా పూజా సామాగ్రినీ కూడా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రం నిర్వాహకులు జిల్లా కలెక్టర్కు వివరిస్తూ ఒక ఆవుతో రోజుకు పాలతోనే కాకుండా గోమయంతో 300 రూపాయలు అదనంగా పొందవచ్చన్నారు. ఇటీవల కాలంలో చాలా మంది వారి తల్లిదండ్రులు చనిపోతే టైర్లతో దహన సంస్కారాలు నిర్వహించడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గోమూత్రంతో కూడా షాంపూలు తయారు చేశామని దాంతో చుండ్రు గాని, జుట్టు రాలడం గాని అరికట్ట వచ్చనీ కలెక్టర్కు వివరించారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇటువంటి గోమయంతో తయారుచేసిన వస్తువులను జిల్లాలోని అన్ని దేవాలయాల్లో విక్రయించేందుకు దేవాలయాల పరిధిలో ఉన్న మహిళ రైతులకు క్లస్టర్ ఎకానమీ పాలసీ కింద గో మయంతో తయారుచేసే వస్తువులపై శిక్షణ ఇచ్చి వారి ద్వారానే స్థానికంగా ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయించి అమ్మకాలు జరిపే విధంగా ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ డిఆర్డిఏ పిడి హరిహరనాదుకు సూచించారు.
అంతేకాకుండా స్వయం సహాయ సంఘాల మహిళలకు శిక్షణ ఇప్పించి కూడా ఇటువంటి గోమయం, గోమూత్రం తో తయారు చేసే పూజా సామాగ్రిని స్మశాన వాటికల వద్ద కూడా అమ్మేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపార పోర్టల్స్ అయిన ఓఎన్డిసి, ఆన్లైన్ చేయిస్తే కూడా మంచి మార్కెట్ వస్తుందన్నారు. తదుపరి నువ్వుల నూనెను గానుగ ద్వారా ఆడిస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు
తదనంతరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల రైతులకు సుభాష్ పాలేకర్ కృషితో చేపట్టిన రైతు శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విజయరామ్ జిల్లా కలెక్టర్ను రైతులకు పరిచయం చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రకృతి ప్రేమికులని, ప్రకృతి అన్నా, మన సంస్కృతి అన్నా కలెక్టర్కు చాలా ఇష్టమని తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల విజయవాడకు బుడమేరు వరదలు వచ్చినప్పుడు గాని, మోంత తుఫాను వచ్చినప్పుడు గానీ వర్షపునీటిలో మునిగిన రసాయన ఎరువులు వాడిన వరి పొలం, పక్కనే ప్రకృతి వ్యవసాయంతో పండించిన వరి పొలంలో రెండు ఫైర్లు నేల వాలినప్పటికీ, వారం రోజులు తర్వాత పరిశీలిస్తే ప్రకృతి సేద్యంతో పండించిన వరి మరల నిలుచుని దిగుబడి బాగా వచ్చిందని, అదే రసాయనిక ఎరువులతో పండించి నేలకు వాలిన వరి అలాగే ఉండిపోయి కుళ్ళిపోయి పంట నష్టం జరిగిందన్నారు.
భూమికి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం శ్రేయస్కరం కాదని, మానవుల ఆరోగ్యానికి హానికరమని కలెక్టర్ హితవు పలికారు.ప్రస్తుతం ప్రజలు ఒక పూట మాత్రమే అన్నంతో భోజనం చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులకే మంచి డిమాండ్ ఉంటుందని ఆలోగా ఇప్పటినుండే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి అధిక ఆదాయాన్ని పొందాలన్నారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ క్షేత్రంలో రైన్ గన్ ఉపయోగించి పసుపు చామ, వట్టివేరు, బచ్చలి, అల్లం, అరటి, గోంగూర, కొత్తిమీర, పాలకూర తదితర 24 రకాల పంటలను ఒక ఎకరంలో ఒకే చోట అంతర పంటలుగా బెడ్ విధానంలో నీరు నిలవకుండా బెడ్ విధానంలో పండిస్తున్న తోటలను నిర్వాహకులు జిల్లా కలెక్టర్కు ఎలా సాగు చేస్తున్నారో వివరిస్తూ చూపించారు.
జిల్లా కలెక్టర్ ఎంతో నిశితంగా విపులంగా అందరికీ అర్థమయ్యే రీతిలో హరిత విప్లవం ఎలా వచ్చింది, నేడు సమాజంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితులను వివరించడంతో రైతులందరూ కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇంత చక్కగా వివరిస్తారని తాము అనుకోలేదని ఒక ఐఏఎస్ అధికారి, ఒక కలెక్టర్ ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా లోతుగా అధ్యయనం చేసి వివరించడం గొప్ప విషయం అని రైతులు అందరూ కలెక్టర్ ను కొనియాడారు.
తదుపరి నిర్వాహకులు రైతులతోపాటు జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆహారాన్ని అందించారు. మూడు జిల్లాల రైతులు జిల్లా కలెక్టర్ తో ఈ సందర్భంగా గ్రూప్ ఫోటో దిగేందుకు ఎంతో ఉత్సాహం చూపారు.
కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, వ్యవసాయ శాఖ ఏడి మణిధర్, గూడూరు తహసిల్దారు రాజ్యలక్ష్మి తదితర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

