కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
ఆరోగ్యకర జీవనం కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజైనా సైకిల్ వాడి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సిబ్బంది తో కలిసి సైకిల్ పై కలెక్టరేటుకు చేరుకుని అందరిలో స్ఫూర్తినింపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయాల సిబ్బంది తో కలిసి పాల్గొన్నారు.
కలెక్టర్ నేతృత్వంలో అందరూ కలెక్టరేట్ లోని చెత్తాచెదారాలను, పిచ్చి మొక్కలను తొలగించి ట్రాక్టర్లకు ఎక్కించారు. తొలుత జిల్లా కలెక్టర్ అందరిచేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోటారు వాహనాలు, యంత్రాల వినియోగంతో రాను రాను వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇందులో భాగంగానే కలెక్టరేట్లో ప్రతి శనివారం జిల్లా అధికారులు, సిబ్బంది ఎవరు కూడా మోటారు వాహనాలు వేసుకొని రాకూడదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.
కాలినడకన గాని లేదా సైకిల్ పైన గాని కార్యాలయాలకు రావాలని సూచించామన్నారు.
ఇదేవిధంగా ప్రజలందరూ కూడా వారానికి ఒకసారి సైకిల్ ను వినియోగించి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారణకు తోడ్పడాలన్నారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అంతేకాకుండా కాలినడక వలన గాని సైకిల్ తొక్కడం వల్ల గాని అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, డీఈవో పివీజే రామారావు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ్, డిఎల్పిఓ రజావుల్లా, ఎస్ టి ఓ నిర్మల, పోస్ట్ మాస్టర్ చెన్నకేశవరావు, పలువురు కలెక్టరేట్ కార్యాలయాల సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

