కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
తక్కువ ఖర్చుతో కూడిన ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉయ్యూరు మండలం, గండిగుంట–2 రైతు సేవ కేంద్రం నుంచి స్థానిక రైతులతో కలిసి వర్చువల్ గా పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు.
కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులను తగ్గించి, తక్కువ ఖర్చుతో కూడిన ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల అధిక ఆదాయం పొందవచ్చని, నేల ఆరోగ్యంగా ఉంటుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన వరి పంట ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని పడిపోకుండా నిలబడుతుందని, దీని ద్వారా నష్టాలను అధిగమించవచ్చని సోదాహరణంగా వివరించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
వినియోగదారులు ఇష్టపడే వరి రకాలను ఎంచుకుని సాగు చేయాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, ప్రతి 15 రోజులకు ఒకసారి పంటను తీసి నిరంతర ఆదాయం పొందవచ్చు అని వివరిస్తూ, దీనికి ప్రభుత్వం ఎన్నో రాయితీలను కల్పిస్తోందని, ఆసక్తి గల రైతులు ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో గండిగుంట గ్రామానికి చెందిన రైతులు చిట్టినేని సతీష్ కుమార్, పాలడుగు క్రాంతి కుమార్ తాము అవలంబిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అదేవిధంగా ఆకునూరు గ్రామానికి చెందిన మాగంటి కిరణ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి, మినుము పంటల సాగుకు సంబంధించిన అనుభవాలను వారు కలెక్టర్ తో ఈ సందర్భంగా పంచుకున్నారు.
కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో బీఎస్ హేలా షారోన్, మండల తహసిల్దారు సురేష్, మండల వ్యవసాయ అధికారి నిస్సీ గ్రేస్, పశుసంవర్ధక శాఖ ఏడి రామ్ శేఖర్, వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్, ఉద్యాన అధికారి మానస, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
.

