కృష్ణాజిల్లా : కృత్తివెన్ను : ది డెస్క్ :
డ్రోన్ కెమెరాల నిఘా నీడలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు
ప్రజారోగ్యాలను పాడుచేసే నాటుసారా తయారీకి పాల్పడినా, సహకరించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
మారుమూల ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తూ, ఎంతోమంది అమాయక ప్రజల జీవితాలను కాలరాస్తున్న నాటుసార ఆనవాళ్లు జిల్లాలో ఏ మూలా కనపడకూడదన్న జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు నిఘా ను పటిష్టం చేసి ఎక్కడికి అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో ప్రధాన భూమిక పోషిస్తున్న డ్రోన్ కెమెరాలతో సర్వేలెన్సును మరింత పెంచి డేగ కళ్ళతో కంటికి కనబడని మారుమూల ప్రాంతాలలో నాటు సారా తయారు చేస్తున్న గుర్తులు కల్పించిన తక్షణమే అక్కడ ప్రత్యక్షమై నాటు సారా స్థావరాలను ధ్వంసం చేయటమే కాక కేసులు నమోదు చేస్తున్నారు కృష్ణాజిల్లా పోలీసులు.
డ్రోన్ కెమెరా సర్విలెన్సులో భాగంగా ఈరోజు కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమర్రు గ్రామ పరిధిలోని మడ అడవుల్లో నాటు సారా తయారీకి పాల్పడుతున్నారని గుర్తించి వెంటనే సంబంధిత సమాచారం కృత్తివెన్ను పోలీసు వారికి అందజేయగా, కృత్తివెన్ను ఎస్ఐ A.పైడి బాబు సిబ్బందితో కలిసి రహదారి మార్గం లేని ఆ స్థావరానికి పడవ లో ప్రయాణం చేసి, ఆ ప్రాంతానికి చేరుకోగా పోలీసు వారి రాకను గమనించి సారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తులు అక్కడినుండి పరారవ్వగా, 40 లీటర్ల నాటు సారాను, తయారీకి ఉపయోగించే వస్తువులు, ప్లాస్టిక్ డ్రమ్ములు సీజ్ చేసి, 1000 లీటర్లకు పైగా బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది.
ప్రజారోగ్యాలను పణంగా పెట్టి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఎవరైనా నిషేధిత నాటు సారాను తయారు చేయాలని చూస్తే అది ఎంత మారుమూల ప్రాంతమైన మీ ఆటలు కట్టించడానికి కనపడని డేగ కన్నుతో సిద్ధంగా ఉన్నామని, అలా తయారికి పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఈ దాడులు నిరంతరంగా జరుగుతాయని ఎస్పీ తెలిపారు.

