- రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కు చర్యలు.. ఇది ఒక చరిత్రగా భావిస్తున్నామని వెల్లడి
- తూర్పుగోదావరి జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. కేవలం 4,5 గంటల్లోనే రైతుల ఖాతాలో రూ. 400 కోట్లు జమ
- ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, లేఔట్లలో రైతన్న పండించిన ధాన్యాన్ని ఆరబోసుకొని ఎండబెట్టుకునే వెసులుబాటు కల్పించామని స్పష్టం
- కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని వెల్లడి
🔴 రాజమహేంద్రవరం/కొవ్వూరు : ది డెస్క్ :

రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుంది అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఇది ఒక చరిత్రని పేర్కొన్నారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు. తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాల్లో 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల దాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం 4,5 గంటల్లోనే రైతుల ఖాతాలో రూ. 400 కోట్లు జమ చేశామన్నారు. రవాణా, గోన సంచుల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే లోతుగా విశ్లేషించి సంబంధిత సమస్యను పరిష్కరిస్తామన్నారు. రైతన్న ఎక్కడా కష్టాన్ని ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో తాము పని చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కల్పించే వెసులుబాటును అన్నదాతలకు మరింత ఉపయోగపడేలా చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి తగిన రీతిలో శిక్షణ అందించామన్నారు. యంత్రాలు మార్చామన్నారు. తేమ శాతంలో ఎక్కడ పొరపాట్లు దొర్లకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతన్నకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నామన్నారు.
అకాల వర్షాల వల్ల అల్పపీడనం ఏర్పడుతుందన్న అభద్రతాభావంతో రైతుల ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని , 28,29 తేదీల తర్వాతనే వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి తాము వ్యవసాయ పొలాల్లో పర్యటించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్షాలు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో ఉచిత టార్పాలిన్లు రైతులకు అందజేశామని , ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, లేఔట్లలో ధాన్యాన్ని ఆరబోసుకొని ఎండబెట్టుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతుకు నష్టం కలగకుండా చర్యలు తీసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వాన్నిదని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు తెలిపారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు.

