The Desk…Kankipadu : ఐదు సంవత్సరాల చిన్నారిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పజెప్పిన శక్తి టీం

The Desk…Kankipadu : ఐదు సంవత్సరాల చిన్నారిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పజెప్పిన శక్తి టీం

కృష్ణా జిల్లా : కంకిపాడు : ది డెస్క్ :

తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని ఐదు సంవత్సరాల చిన్నారి అమ్మమ్మ గారి ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని రోడ్డుపై అటు ఇటు తిరుగుతుండడాన్ని అక్కడే ఉన్న శక్తి టీం సిబ్బంది గుర్తించి ఆ పాప వద్దకు వెళ్లి వివరాలు అడిగి తన తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు.

వివరాల్లోనికి వెళితే…

⏩కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులి రామారావు నగర్ కి చెందిన భాస్కర్, వరలక్ష్మి యొక్క కుమార్తె లోడే. లలిత ను పెనమలూరు నందు ఉన్న తన అమ్మమ్మ ఇంటి వద్ద వారం రోజుల క్రితం వదిలి వచ్చారు.

⏩రోజు తన అమ్మమ్మ దగ్గర ఆడుకుంటూ ఉంటున్న లలిత ఈరోజు అమ్మమ్మ పనికి వెళుతూ తన దగ్గర బంధువు వద్ద పాపను విడిచిపెట్టింది. తనను సరిగా చూడటం లేదని భావించిన ఆ ఐదు సంవత్సరాల పాప వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఎవరికీ తెలియకుండా ఇంటి నుండి బయటకు వచ్చేసింది.

⏩బయటకు వచ్చి సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ కంకిపాడు రోడ్డుపై వెళ్తూ ఉండడాన్ని అక్కడే విధుల్లో ఉన్న శక్తి టీం సిబ్బంది PC -2823 ఉదయ్ కిరణ్, WPC 3154 బేబీ, WPC -1586 సామ్రాజ్యం ఆ పాపను గమనించి దగ్గరకు వెళ్లి విచారించారు.

⏩ఆ పాప తన ఊరు కంకిపాడు అని, తన అమ్మమ్మ ఇంటి నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో చుట్టుపక్కల వారిని విచారించి ఆ పాపను కంకిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ ఒక యువకుడు ఆ పాప గురించిన వివరాలు తెలియజేయడంతో అతను చెప్పిన వివరాల ఆధారంగా తన తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు.

⏩ఆ పాప చెప్పిన వివరాలు వారి తల్లిదండ్రులు నిజమని నిర్ధారణ చేసుకున్న పిమ్మట పాపను కంకిపాడు ఇన్స్పెక్టర్ J.మురళీకృష్ణ, ఎస్సైలు సందీప్, తాతాచార్యులు సమక్షంలో సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

⏩అభం శుభం తెలియని చిన్నారి శక్తి టీం సభ్యులకు కనబడకుండా తప్పిపోతే ఆ పాప పరిస్థితి ఏమయ్యేదో తలుచుకొని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై తన పాపను క్షేమంగా వారికి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

⏩ఆ పాపను గుర్తించి, చాకచక్యంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, పాప తల్లిదండ్రుల వివరాలను కనుక్కొని, తల్లిదండ్రులకు అప్పగించడంలో ప్రముఖ పాత్ర పోషించిన శక్తి టీం సిబ్బందిని గన్నవరం DSP శ్రీనివాస రావు, సిఐ, ఎస్ఐలు ప్రత్యేకంగా అభినందించారు.