The Desk…Kallitanda : అగ్నివీరుడా వందనం

The Desk…Kallitanda : అగ్నివీరుడా వందనం

  • యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగుబిడ్డ
  • ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌పై పోరాటం
  • జమ్మూ కశ్మీర్‌లో అమరుడైన మురళీనాయక్‌
  • సత్యసాయి జిల్లా కళ్లితండాలో విషాదం

సత్యసాయి జిల్లా : ది డెస్క్ :

మురళీనాయక్‌ స్వగ్రామం : కళ్లితండా, గోరంట్ల మండలం, శ్రీసత్యసాయి జిల్లా

సైన్యంలో చేరింది : 2022 డిసెంబరు 29

పనిచేస్తున్న యూనిట్‌ : 851 లైట్‌ రెజిమెంట్‌

తల్లిదండ్రులు : శ్రీరాంనాయక్, జ్యోతిబాయి

వృత్తి : దినసరి కూలీలు.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ లో తెలుగుబిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగాడు. మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీనాయక్‌ (25)కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక. అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరారు. కొద్దిరోజులుగా జమ్మూ కశ్మీర్‌ సరిహద్దులో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు.

మురళి స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. తండ్రి శ్రీరాంనాయక్, తల్లి జ్యోతిబాయి. మురళికి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువని.. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్థులు, బంధువులు తెలిపారు.

2022 డిసెంబరులో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్‌గా సెలెక్ట్‌ అయ్యారు. తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేసినట్లు తండ్రి శ్రీరాంనాయక్‌ చెప్పారు. రెండున్నరేళ్ల సర్వీసు పూర్తికావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్‌ పూర్తి చేసుకుని వస్తాడని కలలుకంటున్న తల్లిదండ్రులు.. మురళి వీరమరణం గురించి తెలిసి దుఖఃసాగరంలో మునిగిపోయారు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏకైక సంతానం…మురళి తల్లిదండ్రులు తమ ఏకైక కుమారుడిని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశించారు. ఇందుకోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధమై పనుల కోసం ముంబయికి వెళ్లారు. అక్కడ తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా, తల్లి ఇళ్లలో పనులు చేస్తున్నారు. మురళిని నాగినాయని చెరువు తండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. మురళి పదో తరగతి వరకు సోమందేపల్లిలో, ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు.

శ్రీరాంనాయక్, జ్యోతిబాయి దంపతులు తండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబయి నుంచి వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపారు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని రోదిస్తున్నారు.

‘పంజాబ్‌లో పని చేస్తున్నట్లు చెప్పాడే తప్ప జమ్మూ కశ్మీర్‌లో డ్యూటీ అని మాకు చెప్పనేలేదు’ అని మురళి తండ్రి శ్రీరాంనాయక్‌ తెలిపారు. ‘గురువారం ఉదయం మాతో వీడియో కాల్‌ మాట్లాడాడు. తాను బాగున్నానని చెప్పాడు. మేం ఎలా ఉన్నామని అడిగాడు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది’ అంటూ బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు.

పెళ్లి చేయాలని.. ఇల్లు కట్టుకుని...

గారాబంగా పెంచుకుంటున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతడి మరణవార్తతో ఇక తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మురళీనాయక్‌ భౌతికకాయం శనివారం కళ్లితండాకు చేరనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదేరోజు ప్రభుత్వ అధికార లాంఛనాలతో స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మంత్రి సవిత రూ. 5 లక్షల సాయం మురళీనాయక్‌ వీరమరణం గురించి తెలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత శుక్రవారం తండాకు చేరుకుని ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు.

తనవంతు సాయంగా రూ.5 లక్షల చెక్కు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఆదుకుంటాయని భరోసా ఇచ్చారు. తండ్రి శ్రీరాంనాయక్‌ కోరిక మేరకు యువతకు స్ఫూర్తినిచ్చేలా తండాలోని వారి సొంత పొలంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.