- యువత, విద్యార్థులను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమే
- వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని వదిలేసింది జగనే..!!
- ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తున్నాము➖ మంత్రి మనోహర్
🔴 కాకినాడ : ది డెస్క్ :
వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించలేదు. గత ఐదేళ్లు యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదం.
వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ రోజు యువత, విద్యార్థులకు ఈ దుస్థితి తలెత్తింద’ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్నికల వాగ్ధానాలను అమలు చేసి తీరుతామని వెల్లడించారు.

మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..
“వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను దగా చేశారు. యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడటానికి సిగ్గుండాలి. వైసీపీ తమను మోసం చేసిందని యువత నమ్మారు కాబట్టే సార్వత్రిక ఎన్నికల్లో, మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. వైసీపీ వాళ్లవి దగా పోరాటాలు.
వాలంటీర్ల జీవో కూడా పొడిగించలేదు
44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ అధినాయకుడు గొప్పలు చెప్పుకొన్నాడు. వాళ్లు ఇచ్చామని చెప్పుకొనే ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉన్నారు. వాళ్లకు గత ప్రభుత్వంలోనే గడువు ముగిసినా పొడిగించేందుకు ఎటువంటి జీవో జారీ చేయలేదు.జీవో ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లి వాలంటీర్లను దగా చేసింది జగనే. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని నివేదికలు తెప్పించుకుని చూస్తే వాళ్ల గడువు తీరిందని తేలింది. జగన్ ఎన్నికలకు ముందు ఎప్పుడు మాట్లాడినా వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పాడు తప్ప, ఎక్కడైనా వాళ్ల అగ్రిమెంట్ రెన్యువల్ చేస్తామని చెప్పలేదు. వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని మోసం చేసింది వైసీపీ అధినాయకుడే. వైసీపీ పాలనలో ఏ వర్గాలైతే మోసానికి గురయ్యాయో వాళ్లందరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.
ఆవిర్భావ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు
పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా నిర్వహిస్తోన్న ఆవిర్భావ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు లాజిస్టిక్స్ కమిటీ, మెడికల్ కమిటీలతో సమావేశాలు నిర్వహించాం. పార్కింగ్ ప్రదేశాల్లోనూ, సభా ప్రాంగణంలో సెక్యూరిటీ ఏర్పాట్లుపై సమీక్షించాం. 14 అంబులెన్సులు, 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అత్యవసర చికిత్స సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్థానిక అపోలో ఆసుప్రతి యాజమాన్యం ముందుకు వచ్చింది.
వాళ్లకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఐదు పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్దేశిత ప్రదేశాల్లో పార్కింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మన భాష, యాస, సంస్కృతి ప్రతిబింబించేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. అంచెలంచెలుగా జనసేన ఎదిగిన తీరు, దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త చరిత్రను లిఖించిన ప్రయాణాన్ని విజువల్ రూపంలో చూపిస్తాం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ సభలో సామాన్యులకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాం.
సామాజిక అంశాలపై విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకార సోదరులు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు సభ తిలకించేలా, ఎక్కడా తోపులాటలకు తావులేకుండా సభా ప్రాంగణం నుంచి హైవే వరకు ఎల్ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
పేదలకు అధికారం పంచడమే జనసేన లక్ష్యం : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ “ఆవిర్భావ సభకు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించాం. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరికి ఆ రోజు దిశానిర్దేశం చేస్తారు. సభ నిర్వహణ కోసం దాదాపు 14 కమిటీలను నియమించాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.