కాకినాడ జిల్లా : THE DESK :
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు.

అనంతరం కాకినాడ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చా. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది.

మా పాలన పగ, ప్రతీకారాలతో ఉండదు. అలాగని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించి 51వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు వెయ్యి నుంచి 1100 లారీలు వస్తాయి.
ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది. కానీ, ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే. పౌరసరఫరాలశాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసినా స్థానిక అధికారులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు.
బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్ వర్క్ పనిచేస్తోంది’’ అని పవన్ అన్నారు.*రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం*‘‘రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. మొత్తం నెట్ వర్క్‌ను బ్రేక్‌డౌన్ చేయాలి. రేషన్ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలి. కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ.43 ఖర్చు అవుతోంది.

కానీ, కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. కిలో బియ్యం రూ.73కు విదేశాల్లో అమ్ముతున్నారని తెలిసింది. పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలి. రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలి. కాకినాడ పోర్టులో సెక్యూరిటీ వైఫల్యం దేశ భద్రతకే ప్రమాదం.
కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తా. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతాం. కాకినాడ యాంకర్ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి నుంచి కేవలం సరకులు మాత్రమే రవాణా జరగాలి’’ అని డిప్యూటీ సీఎం అన్నారు.