The Desk…Kaikaluru : ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు – కైకలూరులో రహదారికి మరమ్మతులు

The Desk…Kaikaluru : ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు – కైకలూరులో రహదారికి మరమ్మతులు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు డి.ఎస్.పి డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు, రామకృష్ణ ఆధ్వర్యంలో, వెంకట కుమార్ తమ సిబ్బందితో కలిసి గురువారం కైకలూరు పట్టణంలోని A టు Z సెంటర్ వద్ద రహదారి పరిస్థితిని పరిశీలించారు.

పరిశీలనలో భాగంగా ఆ ప్రాంతంలో రహదారిపై గుంతలు ఏర్పడటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు చేపట్టేలా సమన్వయం చేశారు. వారి సహకారంతో జేసీబీల సహాయంతో గుంతలను పూడ్చి రహదారిని మరమ్మతు చేశారు.

ఈ సందర్భంగా పట్టణ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. రహదారులపై గుంతలు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వాహనదారులు అతివేగం తగ్గించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో హెడ్‌లైట్లు సరిగా ఉపయోగిస్తూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు పోలీసులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో స్థానిక ప్రజలు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.