The Desk … Kaikaluru : కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

The Desk … Kaikaluru : కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు


సమీక్షా సమావేశంలో అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక జాతర మహోత్సవాలు (తీర్థం) ఫిబ్రవరి 18 నుండి మార్చి 3 వరకు ఘనంగా నిర్వహించనున్నారని దేవస్థాన అధికారులు తెలిపారు.

జాతర ఏర్పాట్లపై గురువారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ముందుగా అధికారులు, నాయకులు, ధర్మకర్తల మండలి శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీక్ష సమావేశానికి ఏలూరు ఆర్టీవో, ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్, కైకలూరు రూరల్ సీఐ రవికుమార్, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, కైకలూరు తహశీల్దార్, జనసేన నాయకుడు కొల్లి బాబీ, ఆలయ చైర్మన్ వెంకన్న, ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి, నాయకులతో కలిసి “అమ్మవారి జాతర” స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, రవాణా, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. శాఖలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఫిబ్రవరి 18 నుండి మార్చి 3 వరకు జరిగే ఈ వార్షిక జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలిపారు.