ఏలూరు జిల్లా : కైకలూరు (క్రైమ్) : ది డెస్క్ :
గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరంపై కైకలూరు టౌన్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ సూచనలతో అందిన సమాచారం మేరకు మండలంలోని వింజరం లాకులు గ్రామంలోని సాలిపేట ప్రాంతంలో రహస్యంగా సాగుతున్న పేకాట శిబిరంపై కైకలూరు టౌన్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.10,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ ..ప్రజల ఆర్థిక అవసరాలకు విఘాతం కలిగించే పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్నవారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలు గమనించిన పక్షంలో డయల్ 112 లేదా కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని ఎస్ఐ తెలిపారు.