- ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
- కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాసరావు, పత్సమట్ల ధర్మరాజు..
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

కొల్లేరులో వాస్తవ పరిస్ధితులు పరిశీలించేందు ఈనెల 17,18 తేదీల్లో జిల్లాలో సుప్రీంకోర్ట్ నియమించిన సాధికారిత కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
సోమవారం సాధికారిత కమిటీ పర్యటన ఏర్పాట్లపరిశీలనలో భాగంగా నిడమర్రు మండలం తోకలపల్లి, మండవల్లి మండలం మణుగునూరు, పూలపర్రు, కైకలూరు మండలం ఆటపాక, ఆలపాడు, కొల్లేటికోట ప్రాంతాలలో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. వీరితో పాటు కైకలూరు శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాసరావు, ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. కొల్లేరుకు సంబంధించి సుప్రీం సాధికారిత కమిటీ ఈనెల 17,18 తేదీల్లో కొల్లేరులోని కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్నట్లు తెలిపారు. మానవీయ కోణంలో కొల్లేరులో ఎన్ని నివాసిత ప్రాంతాలు ఉన్నాయి, జిరాయితీ భూములు, డి.ఫారం పట్టా భూములు ఏమున్నాయి, 2006 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేశారనే సంబంధిత 4 అంశాలను కమిటీ పరిశీలించనున్నదన్నారు. దీనికి సంబంధించి మంగళ, బుధవారాల్లో సాధికారిత కమిటీ పర్యటించే ప్రాంతాల ప్లాన్ ను తయారు చేసేందుకు ఈరోజు క్షేత్రస్ధాయిలో పర్యటించడం జరిగిందన్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం బుధవారం ఏలూరు కలెక్టరేట్ లో కొల్లేరుకు సంబంధించిన వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. పశ్సిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలోని కొల్లేరు వాసులు కూడా తమ సమస్యలను అందజేయవచ్చన్నారు.

కైకలూరు శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పర్యావరణ వేత్తలు, కొల్లేరులో కొన్ని వందల సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ప్రజలు వారి అవసరాలు, వారి సమస్యలు, జీరాయితీ భూములకు సంబంధించి పరిశీలనకోసం సుప్రీం సాధికారిత కమిటీ జిల్లాలో పర్యటించనున్నదన్నారు.
కొల్లేరులో వాస్తవ పరిస్ధితులు పరిశీలించి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున, కొంతమంది ప్రైవేట్ రైతులు కూడా అర్జీని పెట్టుకోవడం జరిగిందన్నారు.
2006లో కొల్లేరులో చేపల చెరువులు కొట్టిన పరిస్ధితి, ప్రజల జీవనవిధానం వారి ఇబ్బందులను జీరాయితీ భూముల వివరాలను కమిటీ మంగళవారం నిడమర్రు ప్రాంతంలో జిరాయితీ భూములను, బుధవారం కైకలూరు ప్రాంతంలోని ఆటపాక, కొల్లేటికోట లో పర్యటించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్బంగా తర తరాల నుంచి జీవిస్తున్న కొల్లేరు ప్రజలు తమ వినతులను కమిటీకి సమర్పిస్తారన్నారు. అనంతరం కమిటీ పైడిచింతలపాడు మీదుగా ఏలూరు చేరుకుంటుందన్నారు. అయితే ఈ పర్యటనలో కొన్ని మార్పులు కూడా ఉండవచ్చని వాటిని తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ.. సుప్రీంకోర్ట్ నియమించిన సాధికారిత కమిటీ మంగళవారం నిడమర్రులో పర్యటిస్తుందని, కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు, కొల్లేరు పరిరక్షణ, తదితర అంశాలను కమిటీ దృష్టికి ప్రజలు తీసుకువస్తారన్నారు. కూటమి ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణతోపాటు, ప్రజల సంక్షేమాన్ని కూడా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. కమిటీ ఏలూరులో సమావేశం సమయంలో ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరు ప్రాంత ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తారని చెప్పారు.
వీరివెంట ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఎఫ్ఓ (వైల్డ్ లైఫ్) బి. విజయ తదితరులు ఉన్నారు.