ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మండలంలోని కొల్లేటి నడిబొడ్డులోని కొల్లేటికోటలో కొలువై ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర (తీర్థం) ఉత్సవాలు శనివారం ఉదయం 8.54 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 1 నుంచి 13 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 10న జలదుర్గా గోకర్ణేశ్వరస్వామివార్ల కళ్యాణం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమ్మవారి ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే డా . కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు కూటమి నాయకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు.

ఉదయం విఘ్నేశ్వరపూజ పుణ్యహవచన, జలదుర్గా సమేత పెద్దింటి అమ్మవారికి పంచామృత అభిషేకం, శ్రీచక్రార్చన, నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, దూపసేవ, బాలభోగం, ప్రథమావరణ కలశ పూజ నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పములు తదితరాలు నిర్వహించారు.

అమ్మవారికి మండలంలోని భుజబలపట్నంకు చెందిన ముదునూరి రామలింగరాజు-రామసీత దంపతులు పుష్పాలంకరణ చేయించి భక్తులకు ఉచిత ప్రసాదం అందించారు. దాతలకు ఆలయ అర్చకులు ప్రత్యేక దర్శనం కల్పించి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. సాయంత్రం ఏలూరుకు చెందిన సప్పా భారతిచే పార్వతీ కళ్యాణం హరికథా కాలక్షేపం నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు, ఎన్డీఎ కూటమి నాయకులు కొల్లి బాబీ, బలే ఏసురాజు, కొల్లి రాంబాబు, తోట లక్ష్మి, తులసి పూర్ణ, సర్పంచ్ భలే సముద్రుడు, మండవల్లి జడ్పిటిసి భర్త మల్లికార్జునరావు, జయమంగళ సుబ్బరాజు, చింతపాడు సర్పంచి మహావిష్ణు, వీర్రాజు, తోట సంజయ్, కటికన ప్రకాష్, కమ్మిలి నాగరాజు, లంక గ్రామాల ప్రజలు, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.