కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :
కొల్లేరు ఆక్రమణల పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు ప్రజలు ఆందోళన పడవద్దని.. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో పోరాడుతామని ఏలూరు పార్లమెంట్ సభ్యు లు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు.
కొల్లేరు ప్రజల ఐక్యత సమావేశం శనివారం కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా నందు ఏర్పాటు చేసి.. కార్యక్రమానికి బలే యేసు రాజు (రాష్ట్ర వడ్డీ సాధికారిక కన్వీనర్) సభాధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు ఎవరూ కూడా అధైర్యపడోద్దని.. ప్రభుత్వం మనదేనని భరోసా కల్పించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో సమావేశం ఏర్పాటు చేసి.. ఇంప్లీడ్ పిటిషన్ వేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కృషి చేస్తే.. కొల్లేరు ప్రజల తరఫున సుప్రీంకోర్టులో పోరాడతానన్నారు.

ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు కొల్లేరు కోసం పోరాడుతానని.. పర్యావరణానికి కొల్లేరు ప్రజలు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. పర్యావరణంతో పాటు మానవ మనుగుడ కూడా అవసరమని గుర్తించాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి.. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. కొల్లేరులోని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మీ తరపున ప్రభుత్వానికి వాదనలు వినిపిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.


ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ..కొల్లేరు ప్రజల తరపున ప్రభుత్వం తక్షణమే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని.. ఇల్లు కాలిన తర్వాత గంటల కారు వస్తే ప్రయోజనం ఏమీ ఉండదని.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్సీ కమ్మిలి విట్టల్ రావు, సైదు సత్యనారాయణ, కొల్లి వర ప్రసాద్ (బాబి), జయమంగళ సుబ్బరాజు, ముంగర మల్లికార్జునరావు, సముద్రుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, కొల్లేటి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.