The Desk… Kaikaluru : విద్యార్థులు దేశం గర్వించే శాస్త్రవేత్తలుగా ఎదగాలి

The Desk… Kaikaluru : విద్యార్థులు దేశం గర్వించే శాస్త్రవేత్తలుగా ఎదగాలి

  • నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ప్రారంభంలో ఎమ్మెల్యే డా. కామినేని

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

మీరంతా దేశానికి ఉపయుక్తంగా ఉండే కొత్త ఆవిష్కరణలను రూపొందించి దేశం గర్వించే శాస్త్రవేత్తలుగా ఎదగాలని కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ విద్యార్థులకు హితవు పలికారు. స్థానిక నేషనల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూలులో సైన్స్ ఫెయిర్ను ఏర్పాటుచేశారు. సైన్స్ ఫెయిర్ను శనివారం ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించి పలు ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా తిలకించి అవి పనిచేసే విధానం, వాటివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే సైంటిస్ట్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని, అప్పుడే గొప్ప సమాజం ఆవిష్కృతమవుతుందని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేదే సైన్స్ఫేర్ అని, విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని, తరగతి గదుల్లోనే రేపటి భవిత తీర్చిదిద్దబడుతుందని, అందుకు ఉపాధ్యాయులు ఊతంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటూ.. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులు ఎలా ఉన్నా… గొప్ప స్థాయికి ఎదగాలన్నారు.

అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని, మిస్సైల్ మ్యాన్గా ఎదిగి, ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మనందరికీ స్ఫూర్తిదాయకమని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మరీంతా దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించే స్థాయి చేరుకుని మీ తల్లిదండ్రులు, మీ గ్రామానికి, మీరు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆకాంక్షించారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని స్కూల్లో ఏర్పాటుచేయించిన స్కూలు డైరెక్టర్ గురజాడ చంద్రమోహన్తో పాటు ఉ పాధ్యాయబృందాన్ని అభినందించారు. ముఖ్యంగా చిన్నారులంతా ఎంతో సృజనాత్మకతతో సుమారు 600లకు పైబడి ప్రదర్శనలు (ప్రాజెక్టులు) ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో నేషనల్ స్కూల్ ఊహకందని విధంగగా సైన్స్ ఫెయిర్ నిర్వహించటం మన ప్రాంతానికే గర్వకారణమన్నారు.

భావిభాతర శాస్త్రవేత్తలను తయారు చేయడానికి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దుతున్న నేషనల్ స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయ బృందాన్ని, అందుకు సహకరిస్తున్న విద్యార్ధుల తల్లిదండ్రులను ఎమ్మెల్యే డా. కామినేని ప్రత్యేకంగా అభినందించారు. వినూత్న ఆలోచనలతో విద్యార్థులు తయారుచేసిన, రూపొందించిన ప్రాజెక్టులు తనను ఎంతగానో ఆకర్షించాయని, మరోసారి విద్యార్థులందరికీ తాను ఆశీస్సులందిస్తున్నానని, వారందరికీ భగవంతుడు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలని ఎమ్మెల్యే డా.కామినేని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే డా.కామినేనికి ఘనస్వాగతం

నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్కు స్కూలు డైరెక్టర్ గురజాడ చంద్రమోహన్ సారధ్యంలో విధ్యార్ధులు అపూర్వస్వాగతం పలికారు. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద నుంచి స్కూలు వరకు ఎమ్మెల్యే డా. కామినేనిపై విద్యార్థులు పూలవర్షం కురిపిస్తూ.. సంప్రదాయబద్దంగా నాట్యంచేస్తూ.. హారతులిచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే డా. కామినేనిని స్కూలు ఎంట్రన్స్ వద్ద డైరెక్టర్ చంద్రమోహన్ పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. తదుపరి ఎమ్మెల్యే డా.కామినేని ఇతర అతిథులతో కలిసి నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు.

క్రిస్మస్ కేక్ కటింగ్

నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్కూలు ఆవరణలో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపిపి అడివి వెంకటకృష్ణమోహన్, తహసీల్దారు ఎండి ఇబ్రహీం, కైకలూరు పట్టణ సిఐ రవికుమార్, ఎమ్యీఓ శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది గురజాడ ఉదయశంకర్, ఎన్డీఎ కూటమి నాయకులు ఎఇ గారి శ్రీను, పూల రాజీ, కొల్లి బాబీ, ఎంపిటిసి మంగినేని రామకృష్ణ, కురేళ్ల మురళీకృష్ణ, కె.కె. బాబు తదితరులు పాల్గొన్నారు.