ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
మండలంలోని పందిరిపల్లిగూడెం-వడ్లకూటితిప్ప సరిహద్దులో గల సర్కారు కాలువ వంతెన పై నుండి దూకి ఓ విద్యార్థి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి ఏలూరుకు చెందిన పేడాడ రామకృష్ణ (రాము) కుమారుడుగా తెలియవచ్చింది. రామకృష్ణకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పోలినాయుడు, కుమార్తె వనిత.
కుమార్తె పుట్టినరోజు వేడుకను కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో జరుపుకొనుటకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చారు.
10వ తరగతి చదువుతున్న కుమారుడిని తండ్రి రాము పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించాడు. దీంతో కుమారుడు పోలినాయుడు కన్నీటి పర్యంతమై నేను ఏలూరు వెళ్ళిపోతాను ఇక్కడ ఉండనని తమతో పాటు వచ్చిన ఇంటి పక్కన వారితో చెప్పి కనబడకుండా వెళ్ళిపోయాడు.
భోజన సమయానికి ఆరాతీసి వెతుకుతుండగా.. గుడి మైక్ సెట్ నందు సర్కార్ కాలవ వంతెన పైనుండి ఎవరో బాలుడు దూకిన సమాచారం తెలియడంతో వంతెన వద్దకు వెళ్లి చూడగా.. కుమారుడు కాలువలో దూకి గల్లంతైన విషయం తెలిసింది. ఘటన సమాచారం అందడంతో పోలీసులు గల్లంతయిన బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర తెదేపా వడ్డీ సాధికార కన్వీనర్ బలే యేసు రాజు, సర్పంచ్ సముద్రుడు మాజీ సర్పంచ్ సుబ్బరాజు తదితర కూటమి నాయకులు మరబోట్లు సాయంతో వెతుకగా.. కాలువలో దూకిన బాలుడు ఆచూకీ లభించలేదు. దీంతో కొడుకు జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.