ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ వరద గుప్పెట్లో వణుకుతోంది. ముంపుతో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటువంటి దయనీయ స్థితిలో వరద బాధితులంతా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ పిలుపుతో కైకలూరు నియోజకవర్గంలోని పలువురు చేపల రైతులు బాధితులకు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. తమ వంతు సాయం అందించి మీకు మేము సైతం అంటూ బాధితులకు అండగా నిలిచారు.
గురువారం స్థానిక ట్రావెలర్స్ బంగ్లా వద్ద పలువురు చేపల రైతులు, కైకలూరు డివిజన్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతరులు బాధితులకు సాయంగా నగదును, చెక్కులను ఎమ్మెల్యే కామినేనికి అందించారు.
రూ. 1.4 లక్షలు నగదును, చెక్కు ల రూపంలో రూ.10.5 లక్షలు, మొత్తంగా రూ. 11.9 లక్షలు విజయవాడ వరద బాధితులకు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి కి ఎమ్మెల్యే కామినేని ద్వారా దాతలు అందించారు. బాధితులకు సాయం గా నిలిచిన దాతలను ఎమ్మెల్యే కామినేని అభినందించారు.