The Desk…Jeelugumilli : అధికారులు డబ్బుల కోసం ప్రజలను పీడిస్తే సహించం : ఎంపీ పుట్టా

The Desk…Jeelugumilli : అధికారులు డబ్బుల కోసం ప్రజలను పీడిస్తే సహించం : ఎంపీ పుట్టా

* ఇష్టారీతిన పనిచేసే అధికారులపై శాఖ పరమైన చర్యలు తప్పవు – ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హెచ్చరిక.

ఏలూరు జిల్లా : టి.నరసాపురం : జీలుగుమిల్లి : THE DESK :

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అధికారులు ఎవరైనా డబ్బుల కోసం ప్రజలను పీడిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హెచ్చరించారు. టి.నరసాపురంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం జరిగిన కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ ప్రసంగించారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు పనిచేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఎంపీ మహేష్ కుమార్ హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరైనా నాయకులు, ఆధికారులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పని చేయించుకోవాలని ఎంపీ సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసి నిర్వాసితుల సమస్యలు వివరిస్తానని ఎంపీ పేర్కొన్నారు. సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు.

పోలవరం నియోజకవర్గం పరిధిలోని రహదారులను అభివృద్ధి చేయడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని, వచ్చే ఏడాది నాటికి రహదారులన్ని నూతన శోభ సంతరించుకుంటాయని ఎంపీ తెలిపారు. జీలుగుమిల్లి ప్రాంతంలో ఆయుధ కర్మాగారం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే స్థానికులకు 3 వేల ఉద్యోగాలు, ఇతర ప్రాంతాల వారికి మరో రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చే వీలుందని ఎంపీ తెలిపారు.

పోలవరం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతేనే ఈ ప్రాంతంలోని ప్రజలు, యువత జీవన విధానం మారుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, రూ .2 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వెళ్లిపోతే పోలవరం నియోజవర్గంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఎంపీ తెలిపారు.

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎంపీ సూచించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు. స్థానిక నాయకులు రామకృష్ణ గౌడ్, చలపతి, శ్రీరామ్ మూర్తి, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, నారాయణ, రామారావు, రాంబాబు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.