🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :
పొగాకు రైతుల ఇబ్బందులను తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళి గట్టిగా ప్రయత్నించడంవల్ల అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం అనుమతించిందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం జంగారెడ్డిగూడెం లోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొనుగోళ్ల తీరుని పరిశీలించారు.

అనంతరం రైతులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ..స్వల్ప పెనాల్టీతో అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంవల్ల ఏలూరు జిల్లాలో వర్జీనియా పొగాకు రైతులకు దాదాపు 74 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. దీనికి తోడు ఎన్నడూ లేని స్థాయిలో పొగాకు వేలంలో కేజీకి రూ. 430 ధర పలకడంతో రైతుల ముఖంలో ఆనందం కనపడుతోందని, దీని కోసమే తాను కష్టపడుతున్నానన్నారు.

పొగాకు రైతుల కోరిక మేరకు జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో మరొక NLS ప్లాట్ ఫామ్ మంజూరుకు చర్యలు తీసుకుంటానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఆలాగే పొగాకు పంటను ఎప్పుడు అమ్మినా సమాన ధర (fixed price) వచ్చేట్లు ప్రయత్నిస్తానని కూడా ఎంపీ హామీ ఇచ్చారు. కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ డీపీఆర్ తయారైందని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు.
చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పలు చోట్ల టెలిఫోన్ మొబైల్ సిగ్నల్స్ సమస్య ఉన్నకారణంగా కొత్త టవర్ల ఏర్పాటుకు బిఎస్ఎన్ఎల్ తో మాట్లాడి ఒప్పించినట్లు ఎంపీ వెల్లడించారు. జీలుగుమిల్లి ప్రాంతంలో రానున్న నేవీ డిపో వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని, అటువంటి పెద్ద ప్రాజెక్టుకు అందరూ సహకరించాలని ఎంపీ కోరారు.
ప్రజలకు నష్టం కలిగే ఎటువంటి పని తాను చేయబోనని, జిల్లా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.విమాన ఇంధనంగా పామాయిల్ వాడేందుకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు విజయవంతం అయ్యాయన్నారు
ఎంపీ పుట్టా మహేష్ కుమార్. భవిష్యత్తులో విమాన ఇంధనంగా పామాయిల్ వినియోగంలోకి వస్తే ఆయిల్ పామ్ రైతులకు మంచి రోజులు వస్తాయని, ఇప్పుడున్న ధరకు రెట్టింపు ధర ఆయిల్ పామ్ గెలలకు వస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.
పొగాకు రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రైతులు ఆదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేసేందుకు పొగాకు బోర్డు రక రకాల నిబంధనలు చెప్పడంతో అగమ్యగోచరంగా మారిన పరిస్థితిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చామని, దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ, సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, కేంద్ర వాణిజ్య మంత్రిని పలుమార్లు కలిసి రైతుల తరపున విజ్ఞప్తులు చేశారన్నారు. ఎంపీ కృషితో కేంద్రం స్పందించి స్వల్ప పెనాల్టీతో పొగాకు కొనుగోళ్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, ఇందుకు ఎంపీకి ఎంతో రుణపడి ఉంటామన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సందర్శన : జంగారెడ్డిగూడెం పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించి, సర్వేయర్ శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతతో మాట్లాడి, శిక్షణా వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అలాగే.. నైపుణ్య శిక్షణ పొందిన యువత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా మంచి ఉద్యోగావకాశాలు పొందాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.