The Desk…Jangareddigudem : కల్తీ మద్యం – ముఠా గుట్టురట్టు… అన్నదమ్ముల అరెస్ట్ – సామాగ్రి స్వాధీనం

The Desk…Jangareddigudem : కల్తీ మద్యం – ముఠా గుట్టురట్టు… అన్నదమ్ముల అరెస్ట్ – సామాగ్రి స్వాధీనం

🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :

జంగారెడ్డిగూడెం మండలం వేగవరం కేంద్రంగా కల్తీ మద్యం తయారు చేసి గొలుసు దుకాణాలకు అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ ఏఈఎస్ సీహెచ్ అజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టుకున్నారు.

ఈ రాకెట్ నడుపుతున్న అన్నదమ్ములు నూతి మధు, సాయి రామ్ లను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

రూ.99 ఎమ్మార్పీతో మద్యం దుకాణాల్లో 99 బ్రాండ్ మద్యం కొని దానిని కల్తీ చేసి రెండు రకాల బ్రాండ్లకు చెందిన సీసాల్లో నింపి వీరు గొలుసు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

ముందుగా 99 బ్రాండ్ సీసా మూతలను పరికరంతో తొలగించి.. దానిలోని 30 ఎంఎల్ నుంచి 40 ఎంఎల్ మద్యం తీసి ఆ ఖాళీలో నీళ్లు కలిపి మళ్లీ సీలు వేస్తున్నారు.

ఈ బ్రాండ్ ఎమ్మార్పీ రూ.99 కాగా.. గొలుసు దుకాణాలకు రూ.130కి విక్రయిస్తున్నారు. 99 బ్రాండ్ సీసాల నుంచి సేకరించిన మందును మరో కంపెనీ ఖాళీ సీసాల్లో నింపి కొత్త మూతలు బిగించి గొలుసు దుకాణాలకు రూ.150కు అమ్మి లాభ పడుతున్నారు. ఇలా తక్కువ రకం మద్యాన్ని రెండు బ్రాండ్ల మద్యంగా కల్తీ చేసి, నీళ్లు కలిపి అమ్ముతున్నారు.

ఇంటినే తయారి కేంద్రంగా… వేగవరంలోని తమ ఇంటినే మధు, సాయిరామ్ తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. కల్తీ మద్యంతో ఉన్న 219 క్వార్టర్, 670 ఖాళీ సీసాలు, నకిలీ లోగోతో ఉన్న 19,500 మూతలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్కు చెందిన వ్యాపారి ముల్టా మనోజ్ కు,ర్యాడికో కంపెనీ నకిలీ లోగోతో ఉన్న మూతలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వీళ్లు తయారు చేసిన మద్యాన్ని పరీక్షల కోసం పంపుతున్నామని, ఇందులో నీళ్లే కలిపారా లేక ఇతర రసాయనాలు ఏమైనా వినియోగించారా అన్నది నిర్ధారిస్తామని పేర్కొన్నారు. మధు, సాయిరామ్ గతంలో మద్యం దుకాణాల్లో పనిచేశారని, వీరి తండ్రి నూతి రామకృష్ణ గతంలో సారా కేసుల్లోనూ నిందితుడని ఏఈఎస్ తెలిపారు.

దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఫణికుమార్, ఎక్సైజ్ సీఐ శ్రీనుబాబు, ఎస్సై సుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు.