ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : జాలిపూడి : THE DESK :
భారీ వర్షాలకు, కొల్లేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు.
మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపునకుగురైన వరి పంట పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు.
పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు ముంపున గురై పంట కుళ్ళిపోయి తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాలలో పంటలు ముంపునకు గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏలూరు, పెదపాడు, మండవల్లి, ముదినేపల్లి, నూజివీడు, ముసునూరు, నిడమర్రు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం తదితర మండలాల్లో వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించారు.
పంట నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టాలు నమోదులో వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలన్నారు.
పంట ఏ దశలో ఉన్నా ఎంత మేరకు నష్టం జరిగినా ఎన్యుమురేషన్ చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అన్ని పంటలకు పంటల బీమా పరిహారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు తిరుపతి రంగారావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.