The Desk…International Desk : దటీజ్ ఇండియా… మరో కప్పు సాధించాం..!!!

The Desk…International Desk : దటీజ్ ఇండియా… మరో కప్పు సాధించాం..!!!

  • భారత్‌దే ఛాంపియన్స్‌ ట్రోఫీ రసవత్తర ఫైనల్లో కివీస్‌పై విజయం
  • చెలరేగిన రోహిత్‌.. రాణించిన శ్రేయస్‌

🔴 అంతర్జాతీయం : ది డెస్క్ :

ICC టోర్నీ అనగానే మనపై సత్తాచాటే ప్రత్యర్థి మళ్లీ పరీక్షించింది! ఒత్తిడికి గురి చేసింది. కంగారు పెట్టించింది. సాఫీగా సాగుతున్న ఛేదనను సంక్లిష్టంగా మార్చి.. గెలుపుపై అనుమానాలను రేకెత్తించింది. అయినా మనమే ఛాంపియన్స్‌!రసవత్తర ఫైనల్లో తడబడ్డా నిలబడ్డ టీమ్‌ఇండియా (Team India).. న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. కోట్లాది అభిమానులను మురిపించింది.

ఆఖరి సమరంలో నాటకీయతకు లోటు లేదు! ఉత్కంఠ తప్పలేదు! స్పిన్నర్ల మ్యాజిక్‌తో, రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలవోకగా గెలిచేలా కనిపించిన భారత్‌.. అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ప్రత్యర్థిని 251కే పరిమితం చేసి, ఛేదనలో వికెట్‌ కోల్పోకుండా సునాయాసంగా వంద దాటేసిన జట్టు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. చకచకా మూడు వికెట్లు కోల్పోయిన తరుణాన సింగిల్స్‌ తీయడమే కష్టంగా మారగా.. శ్రేయస్‌ ఆపద్బాంధవుడే అయ్యాడు. తీవ్ర ఒత్తిడిలో అక్షర్‌ చేసిన 29, హార్దిక్‌ కొట్టిన 18, రాహుల్‌ అజేయ 34 కూడా అంతే అమూల్యమైనవి. టోర్నీ ఆద్యంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా.. అజేయంగా కప్పునందుకుంది.

రోహిత్‌సేనది ఎంత ఆధిపత్యమో!

వరుసగా మూడేళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరింది. ఆ మ్యాచ్‌లో ఓటమితో తీవ్ర నిరాశ చెందిన అభిమానులకు నిరుడు టీ20 ప్రపంచకప్‌ను బహుమతిగా ఇచ్చిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీతో మినీ ప్రపంచకప్పును అందించింది.

దుబాయ్‌ టీమ్‌ ఇండియా 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025) చేజిక్కించుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (2/40), వరుణ్‌ చక్రవర్తి (2/45), జడేజా (1/30), అక్షర్‌ (0/29) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట న్యూజిలాండ్‌ 251/7కే పరిమితమైంది. మిచెల్‌ (63; 101 బంతుల్లో 3×4), బ్రాస్‌వెల్‌ (53 నాటౌట్‌; 40 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (76; 83 బంతుల్లో 7×4, 3×6) చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (48; 62 బంతుల్లో 2×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (34 నాటౌట్‌; 33 బంతుల్లో 1×4, 1×6), అక్షర్‌ పటేల్‌ (29; 40 బంతుల్లో 1×4, 1×6) ఒత్తిడిలో విలువైన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను గట్టెక్కించారు.

రోహిత్‌ (Rohit Sharma)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. రచిన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును గెలుచుకున్నాడు. రోహిత్‌ దంచేసినా.. భారత్‌ ఛేదన మొదలైన తీరు చూశాక గెలుపు కోసం 49వ ఓవర్‌ దాకా ఆగాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కివీస్‌ బ్యాటర్లను మన స్పిన్నర్లు కట్టడి చేసిన అదే పిచ్‌పై రోహిత్‌ చెలరేగిపోయాడు. మరోవైపు గిల్‌ (31) అండగా నిలవగా.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. 18.3 ఓవర్లలో స్కోరు 105/0. భారత్‌ అలవోకగా పని పూర్తి చేసేలా కనిపించింది. కానీ ఒక్కసారిగా ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఫిలిప్స్‌ అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్‌కు గిల్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ అనూహ్యంగా మలుపు తిరిగింది. స్పిన్‌తో కివీస్‌ పట్టుబిగించింది.

కోహ్లి (1) కూడా వెంటనే నిష్క్రమించడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. పరుగుల రాక కష్టం కాగా.. రచిన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయిన రోహిత్‌ స్టంపౌట్‌ కావడంతో టీమ్‌ఇండియాకు ఛేదన మరింత కష్టంగా మారింది. 27వ ఓవర్లో భారత్‌ 122/3. అలాంటి స్థితిలో ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్న శ్రేయస్‌ (Shreyas Iyer).. కివీస్‌ స్పిన్‌ పరీక్షకు నిలుస్తూ అక్షర్‌తో కలిసి జట్టును నడిపించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం జట్టును కుదుటపరిస్తే.. కొద్ది తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యాక రాహుల్, హార్దిక్‌ల భాగస్వామ్యం జట్టును విజయపథంలో నడిపించింది.

ఒత్తిడిలో నిలిచారిలా..: ఛేదనలో మొనగాడు కోహ్లి, జోరు మీదున్న రోహిత్‌ కొద్ది తేడాలో వెనుదిరగగా.. ఉత్సాహం పెరిగిన కివీస్‌ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో ఉచ్చు బిగించారు. బౌండరీలు కొట్టడం సరికదా.. సింగిల్స్‌ తీయడమే కష్టమైంది. కివీస్‌ కచ్చితంగా తనకు మంచి అవకాశాలున్నాయని నమ్మిన దశ అది. ఆ స్థితిలో శ్రేయస్‌ కూడా గట్టి పరీక్షను ఎదుర్కొన్నాడు. కాస్త తడబడ్డాడు. అయినా నిలదొక్కుకున్నాడు. అంత ఒత్తిడిలోనూ తనవైన షాట్లు ఆడడానికి వెనుకాడలేదు. మరోవైపు అతడికి అక్షర్‌ (Axar Patel) మంచి సహకారాన్నిచ్చాడు. పరుగుల వేగం మాత్రం తక్కువే. 38 ఓవర్లలో 183/3తో జట్టు కోలుకుంది. అయినా సాధించాల్సిన రన్‌రేట్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది.

తర్వాతి ఓవర్లో (శాంట్నర్‌) శ్రేయస్‌ ఔట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగింది. 42వ ఓవర్లో జట్టు స్కోరు 203 వద్ద అక్షర్‌ కూడా నిష్క్రమించడంతో మ్యాచ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. కివీస్‌ బౌలర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న వేళ అభిమానుల్లో ఆందోళన. కానీ చివరి 8 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో.. ఒత్తిడిని తట్టుకుంటూ రాహుల్, హార్దిక్‌ (18; 18 బంతుల్లో 1×4, 1×6) అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్‌ (KL Rahul).. జట్టుకు అవసరమైన స్థితిలో మరోసారి అదరగొట్టాడు. ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌ ఫోర్‌.. హార్దిక్‌ సిక్స్, ఫోర్‌ జట్టుపై ఒత్తిడిని తగ్గించాయి. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. జేమీసన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ (Hardik Pandya) ఔట్‌ కావడంతో ఉత్కంఠ రేగినా భారత్‌కు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. ఆఖర్లో ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా జడేజా (Ravindra Jadeja)తో కలిసి రాహుల్‌.. జట్టును విజయపథంలో నడిపించాడు. 49వ ఓవర్‌ ఆఖరి బంతికి జడేజా (9 నాటౌట్‌) ఫోర్‌ కొట్టడంతో భారత్‌ లక్ష్యాన్ని అందుకుంది.

కివీస్‌కు స్పిన్‌ వల :

ఊహించినట్లే భారత స్పిన్‌ చతుష్ఠయం న్యూజిలాండ్‌కు ఉచ్చుబిగించింది. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బ్యాటర్లకు కళ్లెం వేసింది. నిజానికి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌.. ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించింది. 7.4 ఓవర్లలో స్కోరు 57/0. ఓపెనర్‌ రచిన్‌ (37; 29 బంతుల్లో 4×4, 1×6) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. ఎనిమిదో ఓవర్లో యంగ్‌ (15)ను ఔట్‌ చేయడం ద్వారా వరుణ్‌.. కివీస్‌ పతనాన్ని ఆరంభించాడు.

ఆ జట్టును గట్టి దెబ్బతీసింది మాత్రం కుల్‌దీపే. భారత్‌ ప్రమాదకరంగా భావించిన రచిన్, కేన్‌ విలియమ్సన్‌ (11)లను అతడు తన వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. ఆ దశలో మిచెల్‌ పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. అక్షర్, కుల్‌దీప్, వరుణ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు చేయడం చాలా కష్టమైనా.. అతడు విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. లేథమ్‌ (14)తో నాలుగో వికెట్‌కు 33, ఫిలిప్స్‌ (34)తో అయిదో వికెట్‌కు 57, బ్రాస్‌వెల్‌తో ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించి 46వ ఓవర్లో మిచెల్‌ నిష్క్రమించాడు. బ్రాస్‌వెల్‌ దూకుడుతో ఆఖరి 5 ఓవర్లలో కివీస్‌ 50 పరుగులు రాబట్టింది.న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: విల్‌ యంగ్‌ ఎల్బీ (బి) వరుణ్‌ 15; రచిన్‌ రవీంద్ర (బి) కుల్‌దీప్‌ 37; విలియమ్సన్‌ (సి) అండ్‌ (బి) కుల్‌దీప్‌ 11; మిచెల్‌ (సి) రోహిత్‌ (బి) షమి 63; లేథమ్‌ ఎల్బీ (బి) జడేజా 14; ఫిలిప్స్‌ (బి) వరుణ్‌ 34; బ్రాస్‌వెల్‌ నాటౌట్‌ 63; శాంట్నర్‌ రనౌట్‌ 8; నాథన్‌ స్మిత్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251; వికెట్ల పతనం: 1-57, 2-69, 3-75, 4-108, 5-165, 6-211, 7-239; బౌలింగ్‌: షమి 9-0-74-1; హార్దిక్‌ 3-0-30-0; వరుణ్‌ చక్రవర్తి 10-0-45-2; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-40-2; అక్షర్‌ పటేల్‌ 8-0-29-0; జడేజా 10-0-30-1భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) లేథమ్‌ (బి) రచిన్‌ 76; శుభ్‌మన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) శాంట్నర్‌ 31; కోహ్లి ఎల్బీ (బి) బ్రాస్‌వెల్‌ 1; శ్రేయస్‌ (సి) రచిన్‌ (బి) శాంట్నర్‌ 48; అక్షర్‌ (సి) ఒరూర్క్‌ (బి) బ్రాస్‌వెల్‌ 29; రాహుల్‌ నాటౌట్‌ 34; హార్దిక్‌ (సి) అండ్‌ (బి) జేమీసన్‌ 18; జడేజా నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254; వికెట్ల పతనం: 1-105, 2-106, 3-122, 4-183, 5-203, 6-241; బౌలింగ్‌: జేమీసన్‌ 5-0-24-1; ఒరూర్క్‌ 7-0-56-0; నాథన్‌ స్మిత్‌ 2-0-22-0; శాంట్నర్‌ 10-0-46-2; రచిన్‌ రవీంద్ర 10-1-47-1; బ్రాస్‌వెల్‌ 10-1-28-2; ఫిలిప్స్‌ 5-0-31-0

”నేను వన్డేల నుంచి రిటైర్‌ కాబోవట్లేదు. దయచేసి వదంతులు వ్యాప్తి చేయొద్దు. భవిష్యత్తు ప్రణాళికలేమీ లేవు”రోహిత్‌ (Rohit Sharma)➖➖➖➖➖➖➖”జట్టును వీడేటప్పుడు మెరుగైన స్థితిలోనే వదలాలి. వచ్చే ఎనిమిదేళ్లలో సత్తా చాటగలిగే జట్టు ప్రస్తుతం మాకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి తర్వాత పుంజుకుని ఓ ఐసీసీ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది

”కోహ్లి (Virat Kohli)➖➖➖➖➖➖➖➖➖భారత్‌కు ఇది వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌. గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచింది.విరాట్, రోహిత్‌ ఖాతాలో ఉన్న ఐసీసీ టైటిళ్లు. రోహిత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన బృందంలో సభ్యుడు కాగా.. కోహ్లి 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో ఆటగాడు. ఇద్దరూ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచిన జట్లలో సభ్యులు.

రూ.19.45 కోట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత్‌కు దక్కిన ప్రైజ్‌మనీ. రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ రూ.9.72 కోట్లు చేజిక్కించుకుంది. సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రూ.4.86 కోట్లు చొప్పున సొంతం చేసుకున్నాయి.