🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం 2025 ఏర్పాట్లపై ఈరోజు సాయంత్రం సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జమ్మిదొడ్డి మీటింగ్ హాల్‌లో సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, దేవస్థానం ఈవో శీనా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, దసరా ఉత్సవాల్లో రద్దీ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణలో సాంకేతికత వినియోగంపై ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భక్తుల సౌకర్యాలను మెరుగుపర్చే చర్యలు పై అధికారులు మంత్రి కి వివరించారు.
ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. సెప్టెంబరు 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
ఈ దసరా లో కమాండ్ కంట్రోల్ రూమ్ కీలకం కావాలని, తిరుమల లో భక్తుల రద్దీ నియంత్రణలో ఏ విధానం ఉందో అదే తరహా లో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలని, భక్తులకు సరైన సమాచారం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి రామనారాయణరెడ్డి ఆదేశించారు.మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారని అందిన సమాచారం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మహిళల సౌలభ్యం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పధకం వలన మహిళా భక్తుల సంఖ్య పెరిగే సంఖ్య ఉందని, దసరా ఉత్సవాల సమయంలోనే విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో భక్తుల సంఖ్య పెద్ద స్థాయిలో పెరుగుతుంది. ఈ సంఖ్య కు తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.త్వరలో రెవిన్యూ, దేవదాయ, హోమ్ మరియు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ముందుకు వెళతామని మంత్రి ప్రకటించారు…….
దేవాదాయ శాఖ కమిషనర్ : దసరా ఉత్సవాల్లో అన్ని శాఖల సమన్వయం అవసరమని, అధికారులు, సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ కీలకమని దేవదాయ శాఖ కమిషనర్ కె. రామ చంద్ర మోహన్ అన్నారు. దేవస్థానం సిబ్బందికి అన్ని పనులపై అవగాహన ఉండాలని, 15 తేదీ లోపు అన్ని పనులు పూర్తి కావాలని,దేవదాయ శాఖ నుండి కావలసిన అన్ని అనుమతులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని రామచంద్ర మోహన్ పేర్కొన్నారు.
ఈ ఉత్సవాల్లో స్వచ్చంద సేవకుల పాత్ర కీలకం మని, వారికి శిక్షణ ఇచ్చి సేవల్లో వినియోగించుకోవాలని ఆదేశించారు. గతం కంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తుల అవసరాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు.
కొత్త హోల్డింగ్ ఏరియాలు, కంట్రోల్ రూమ్ వినియోగం, వెస్ట్ బైపాస్ వినియోగించుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లుందని కమిషనర్ తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా భక్తులకు పూర్తి సమాచారం అందేలా చూస్తున్నమని పేర్కొన్నారు.