- రాజమహేంద్రవరానికి చెందిన నిందితుడి అరెస్టు..‼️
- అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లే..‼️
🔴 TG : హైదరాబాద్ : ది డెస్క్ :
తప్పుడు సమాచారంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల వేదికగా పెళ్లి చేసుకుంటానంటూ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో పలువురు యువతుల నుంచి పెద్ద ఎత్తున నగదు కాజేసిన మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై 24 కేసులున్నాయి.
జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి(33) పలు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో ఓ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఫొటోతో వివరాలు నమోదు చేసి తాను ఎన్నారై, వ్యాపారి, ఐటీ ఉద్యోగినంటూ రెండో వివాహం కోసం చూస్తున్న వారు, మూడు పదుల వయసు దాటిన వారే లక్ష్యంగా వల విసిరేవాడు. వాట్సప్ కాల్ ద్వారా మంతనాలు జరిపేవాడు.
తన తల్లి అమెరికాలో వైద్యురాలని, తాను స్థానికంగా ఉంటూ వ్యాపారం చేస్తుంటానని, అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి చేసుకుందామంటూ నమ్మించేవాడు. నమ్మకం కుదిరాక తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారని, ఐటీ అధికారులు నగదు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారని, వ్యాపారంలో నష్టం వచ్చిందని ఒక్కొక్కరి నుంచి రూ.5-25 లక్షల వరకూ కాజేశాడు. బాధితులు డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరించేవాడు.
కాజేసిన సొమ్మును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక వైద్యురాలి వద్ద ఇలానే రూ.10.94 లక్షలు కాజేశాడు. ఆమె ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈనెల 13న బెంగళూరులో అరెస్ట్ చేశారు.బీటెక్ మధ్యలో ఆపేసి..వంశీకృష్ణ బీటెక్ మధ్యలోనే ఆపేసి 2014లో హైదరాబాద్ వచ్చాడు.
2015లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. 2016లో జాబ్ కన్సల్టెన్సీలో చేరి యువకులను ఉద్యోగాల పేరిట మోసం చేసి అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలై సామాజిక మాధ్యమాల్లో మహిళల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి తన ఆదాయంలో అధికశాతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్టు నమ్మించి, దాదాపు 1000 మంది నుంచి డబ్బు వసూలు చేశాడు.
తర్వాత యానాంలోని ఓ శాసనసభ్యుడి ఫొటో డీపీగా పెట్టుకుని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ 50 మంది మహిళలు/యువతుల నుంచి రూ.2.50 కోట్లు కాజేశాడు. వరుస ఫిర్యాదులతో రెండేళ్ల క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.