The Desk…Guntur : గంజాయి వినియోగం, విక్రయం, సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక

The Desk…Guntur : గంజాయి వినియోగం, విక్రయం, సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక

గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యం.

గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేసే దిశగా ప్రత్యేక ప్రణాళికలు.

గడచిన రెండు రోజుల్లో సుమారు 3.5 కేజీల గంజాయి సీజ్, 22 మంది నిందితుల అరెస్ట్.

క్షేత్ర స్థాయిలో ముమ్మర దాడులతో పాటు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి.

గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగం.

శాశ్వత పరిష్కార(గంజాయి నిర్మూలన) దిశగా మూలాల వరకు దర్యాప్తు.

గంజాయి కేసుల్లోని నిందితుల ఆస్తుల జప్తుకు చర్యలు.

గుంటూరు జిల్లా : గుంటూరు : ది డెస్క్ :

నిషేధిత గంజాయి వినియోగించినా.. విక్రయించినా.. సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకలించి, నిర్మూలించడానికి పటిష్ట ప్రణాళికలు రూపొందించామని, పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి, ఈగల్ (EAGLE) టీం వారితో సమన్వయం చేసుకుంటూ గంజాయి విక్రయం, వినియోగం మరియు సరఫరా చేసే వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

గడిచిన రెండు రోజుల్లో …

నల్లపాడు పోలీస్ వారు 1.23 కేజీల గంజాయి సీజ్ చేసి, 08 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.

తాడేపల్లి పోలీస్ వారు 800 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, 09 మందినీ అరెస్ట్ చేశారు.

లాలాపేట పోలీస్ వారు 1.143 కేజీల గంజాయి సీజ్ చేసి, 05 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.

గంజాయి కేసుల్లోని పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారి కదలికలు, వారు చేసే పనులు, వారి జీవన విధానం, వ్యవహార శైలి వంటివి పరిశీలిస్తూ ఎక్కడైనా ఏవైనా అనుమానాస్పద విషయాలు వారిలో కనిపిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.

తరచుగా గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం మరియు నూతన PIT NDPS చట్టం ప్రకారం కూడా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నాం.

డ్రోన్ కెమెరాల సహాయంతో మారుమూల ప్రాంతాలు, పాడుబడిన గృహాలు, ముళ్ళ పొదలు, జన సంచారం లేని ప్రదేశాల్లో డ్రోన్ బీట్ (Drone Beat) తో ఆకస్మిక దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఇక మీదట తరచుగా నిర్బంధ వాహన తనిఖీలు, కార్డాన్ మరియు సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించి అనుమానిత ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తాము.