The Desk…Ghatkesar : ప్రేమ జంట బలవన్మరణం.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

The Desk…Ghatkesar : ప్రేమ జంట బలవన్మరణం.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

🔴 TG : హైదరాబాద్ : THE DESK NEWS :

ప్రేమ జంట బలవన్మరణానికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఘన్‌పూర్‌లోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కన శ్రీరాములు(25), బాలిక (17) పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరి మరణానికి కారణమైన మహేశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఏం జరిగిందంటే❓

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు కుటుంబం 20 ఏళ్ల క్రితం అదే జిల్లా బీబీనగర్‌ మండలం జమిలాపేట్‌కు వచ్చి నివాసముంటోంది. ఆంజనేయులు కుమారుడు శ్రీరాములు (25) ఘట్‌కేసర్‌ మండలం నారపల్లిలో హోల్‌సేల్‌ సైకిల్‌ విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు.

అదే ప్రాంతానికి చెందిన బాలిక (17), శ్రీరాములు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు. వీరి ప్రేమ వ్యవహారం గురించి బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు మందలించి ఆమెపై చేయిచేసుకున్నారు. ఇలా గొడవలు జరుగుతున్నా.. ప్రేమజంట అప్పుడప్పుడూ మాట్లాడుకునేవారు.

ఈ క్రమంలో బాలిక సమీప బంధువు మహేశ్‌ .. వీరి ప్రేమ గురించి తెలుసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. తనకు డబ్బులివ్వాలని.. లేకపోతే తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించేవాడు. భయపడ్డ శ్రీరాములు పలుదఫాలుగా రూ.1.35 లక్షలు ఇచ్చాడు. మరింత డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరిగిపోవడం.. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

కారు అద్దెకు తీసుకుని..!!

శ్రీరాములు సోమవారం మేడిపల్లిలోని ఓ సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు. వారు అనుకున్న ప్రకారం.. బాలిక ఓ ప్రదేశానికి రాగా అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కారులో ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఘన్‌పూర్‌లోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కన కారు ఆపారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నారు.

కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి గట్టిగా హాహాకారాలు చేస్తూ ఫుట్‌పాత్‌ మీద పడి మృతి చెందాడు. బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం ఏ మాత్రం గుర్తించలేనంతగా కాలిపోయింది.

www.thedesknews.net