- రూ.14 లక్షల విలువైన 13.5 కిలోల వెండి, 4 గ్రాముల బంగారం, 2కార్లు స్వాధీనం
- కేసులో ప్రతిభకనబర్చిన కానిస్టేబుల్స్కు రివార్డు
కృష్ణా జిల్లా : ఘంటసాల : ది డెస్క్ :
ఉన్నత విద్యనభ్యసించి విలాసాలకు అలవాటుపడి అంతర్ జిల్లాల దొంగగా మారి మూడేళ్లుగా పోలీసులను తప్పించుకు తిరుగుతున్న కె.కిరణ్ బాబు దంపతులను ఘంటసాల పోలీసులు శనివారం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఘంటసాల పోలీసు స్టేషన్ వద్ద అవనిగడ్డ డీఎస్పీ టి.శ్రీవిద్య మాట్లాడుతూ… ఘంటసాల మండలం శ్రీకాకుళం శివారు శీలంవారిపాలెంలోని శ్రీకోదండరామాలయంలో ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు 11వ తేదీన దేవాలయం కమిటీ సభ్యుడు గాదె వెంకటేశ్వరరావు ఘంటసాల పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ దొంగతనంలో నాలుగు వెండి కిరీటాలు, సీతమ్మవారి రెండుసూత్రాలు ఉన్న బంగారు మంగళసూత్రం, రాములవారికి వేసిన వెండి జద్యం, వెండి బొట్టు, పళ్లెం, వెండి తుటారం (శఠగోపం) దొంగిలించినట్లు గుర్తించగా పోలీసులు, క్లూస్ టీమ్ పరిశీలించారన్నారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ టి.శ్రీవిద్య పర్యవేక్షణలో చల్లపల్లి సీఐ కోవిలపు ఈశ్వరరావు, ఘంటసాల ఎస్ఐ కల్లూరు ప్రతాప్ రెడ్డి నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఇంటిలిజెన్స్ టెక్నాలజీ వినియోగించి 10 రోజుల్లో పట్టుకుని శనివారం సాయంత్రం ఘంటసాల మండలం శ్రీకాకుళం కరకట్ట పై కారులో వెళుతుండగా చెకింగ్ చేసిపట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు.
తక్కువ సమయంలో నిందితులను అరెస్టు చేసిన సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ ప్రతాప్ రెడ్డిలను ఎస్పీ గంగాధరరావు ఆదేశాలతో డీఎస్పీ సీఐ ఈశ్వరరావును, ఎస్ఐ ప్రతాప్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు సిబ్బంది శివాజి, వీరబాబు, మనోహర్, అశోక్, చంద్రశేఖర్, నాగరాజులకు డీఎస్పీ రివార్డు అందించారు.
విచారణలో దిమ్మెతిరిగే నిజాలు :
బీటెక్ చదివి ఉన్నత ఉద్యోగం చేస్తూ.. విలాసాలకు అలవాటుపడిన కిరణ్ బాబు పెదపులిపాక వచ్చి ఏడాదిన్నర క్రితం ఆదాంబిని ని వివాహం చేసుకున్నాడు. 2022 నుంచి 2025 ఐదు దేవాలయాల్లో దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అంతర్జిల్లా దొంగగా మారిన కిరణ్ బాబును పోలీసులు విచారించగా శ్రీకాకుళం శివారు శీలంవారిపాలెం రామాలయంలో దొంగిలించిన వెండి వస్తువులను భార్య ఆదాంబీ సాయంతో వెండిని మిషన్ ద్వారా కరిగించినట్లు చెప్పాడు.
అయితే భర్తతో కలసి శీలంవారిపాలెంలో జరిగిన ఒక్కదొంగతనంలోనే పాల్గొని పట్టుబడింది. అంతే కాక దేవాలయాలే కేంద్రంగా దొంగతనాలు చేస్తూ సుమారు పదేళ్లుగా 34 కేసుల్లో కిరణ్ బాబు జైలుకు వెళ్లొచ్చాడు. తర్వాత 2022 లో చీరాల పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.50 వేల విలువైన బంగారుహారం, 2024లో పామర్రు దేవాలయంలో 4.230 కేజీల వెండి, గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయంలో 2.257 కేజీల వెండి, విస్సన్నపేట దేవాలయంలో రూ.5.5 కేజీల వెండి మొత్తం రూ.14 లక్షల విలువైన 13.5 కేజీల వెండి, 4గ్రాముల బంగారంతో పాటు వస్తువులను, వెండి కరిగించే మిషన్లు, దొంగతనానికి వినియోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రార్ధన స్థలాలు, దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి – డీఎస్పీ శ్రీవిద్య
నియోజకవర్గంలోని అన్ని ప్రార్ధన స్థలాలు, దేవాలయాలు, ఇళ్ల వద్ద, షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవనిగడ్డ డీఎస్పీ టి.శ్రీవిద్య అన్నారు. ఆయా స్థలాల్లో ఏమైన దొంగతనాలు, ఇతర సమస్యలు వచ్చినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఉపయోగపడతాయన్నారు.