కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK :
స్థానిక సంత మార్కెట్ వెనుక భాగంలో మద్యం షాపును ఏర్పాటు చేయవద్దంటూ ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డికి మంగళవారం రాత్రి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు దేవాలయాలు, జనావాసాలకు 100 మీటర్ల పరిధిలో లేని ప్రాంతంలో మద్యం షాపులకు అనుమతులు ఇస్తామని చెప్పారని, కాని ఘంటసాలలో మాత్రం మద్యం షాపు పెట్టే 100 మీటర్ల లోపే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం, పోలేరమ్మ దేవాలయం, సమీపంలోనే చర్చి, విద్యార్థుల ప్రయివేటు ఉండటంతో పాటు ఇళ్లల్లో ప్రజలతో జనావాసాలు ఉన్నాయన్నారు.
ఆయా దేవాలయాలకు, ట్యూషన్కు నిత్యం విద్యార్థులు, ప్రజలు వస్తుంటారని దీంతో ప్రజలకు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుందని ఆరోపించారు.
ఈ ప్రాంతంలో మద్యం షాపును ఏర్పాటు చేస్తే మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, తక్షణమే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే మద్యం షాపును స్థానికులమైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
అర్జీ ఇచ్చిన వారిలో మద్యం షాపు పరిధిలోని కుటుంబాలకు చెందిన రాంబాబు, ఉపాధ్యాయులు వేణు, నాంచారమ్మ, అమృతం, భూలక్ష్మి, సుబ్బమ్మ, కవిత, రమణ, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.