The Desk … Ghantasala : లాభదాయక పంటల ద్వారా రైతులు ఆర్ధిక అభివృద్ధి సాధించాలి : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి

The Desk … Ghantasala : లాభదాయక పంటల ద్వారా రైతులు ఆర్ధిక అభివృద్ధి సాధించాలి : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి

ఘంటసాల కేవీకే సందర్శించిన ఐసీఏఆర్ అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా

కృష్ణా జిల్లా : ఘంటసాల : ది డెస్క్ :

లాభదాయక పంటల ద్వారా రైతులు ఆర్ధిక అభివృద్ధి సాధించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఐసీఏఆర్ అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకేలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నూతన లాభసాటి సాగు విధానాలు చేరువ చేయాలని సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు ఉత్తమ సేవలు అందిస్తోందని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు సమన్వయముతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఘంటసాల కేవీకేను మోడల్ కేవీకేగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఐసీఏఆర్ అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరాను కోరారు.

ముఖ్య వక్తగా విచ్చేసిన ఐసీఏఆర్ అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా ప్రసంగిస్తూ వరిని లాభసాటిగా మార్చే నైపుణ్యం రైతులకు అందించాలని, అదే సమయంలో ఇతర పంటల సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. మార్కెట్ అవసరాన్ని గమనించి పంటలు సాగు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి ఇటీవల కొత్తిమీర రాజస్థాన్ నుంచి వచ్చిందన్నారు. ఆ పరిస్థితి విజయవాడ, అమరావతి, గుంటూరులకు రాకుండా కూరగాయల సాగు ప్రణాళికతో తగిన స్థాయిలో ఉత్పత్తి పెంచాలని సూచించారు. ఘంటసాల కేవీకేకు ఏఐ, మార్కెటింగ్ నిపుణులను నియమించి ఈ ప్రాంత రైతులకు ఉత్తమ సేవలు అందిస్తామన్నారు. ఘంటసాల కేవీకే మోడల్ కేవీకేగా ఎదిగే ఆస్కారం ఉందన్నారు. ప్రపంచంలో ఏ నూతన టెక్నాలజీ వచ్చినా రైతులకు చేరవేయటం కేవీకేల బాధ్యత అన్నారు.

ముందుగా కేవీకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన పరిశీలించారు. భూమి సుపోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా మట్టి పరీక్షలు పరిశీలించారు. నూతనంగా నిర్మించిన విత్తన గిడ్డంగి ప్రారంభించారు. వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ తదితర నూతన ల్యాబ్స్, నూతన త్రాగునీటి సౌకర్యం ప్రారంభించారు. నూతన పుస్తకాలు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జీ.శివన్నారాయణ, సహ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ ఎన్.వీ.వీ.ఎస్ దుర్గా ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎన్.పద్మావతి, జిల్లా మత్స్య అధికారి ఏ.నాగరాజు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.సీ.హెచ్ నరసింహులు, కేవీకే శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.