కృష్ణా జిల్లా : మచిలీపట్నం/ఘంటసాల : ది డెస్క్ :
జిల్లాలోని రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ.. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ఆయిల్ ఫామ్, కొరమేను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీలో పీఎం కృషి యోజన కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించగా, వర్చువల్ గా కృష్ణాజిల్లాలోని మండల కేంద్రమైన ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా పంట కాలువలతో ససస్ శ్యామలంగా ఉంటూ వరి, మినుము పంటల సాగులో ముందంజలో ఉందన్నారు. రాయలసీమ తదితర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో వరి పండించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పరిస్థితులు రాను రాను మారుతున్నాయని గతంలో పంటల సాగుకు పెట్టుబడి తక్కువ ఉండేదని, ఇప్పుడు పురుగుమందులు, కూలి ఖర్చులు పెరగడంతో పెట్టుబడి ఖర్చులు కూడా పెరగడంతో ఎంత వ్యవసాయం చేసిన సంవత్సరానికి ఖర్చులన్నీ పోగా చివరకు 22 వేల రూపాయలు మాత్రమే రైతుకు మిగిలేదన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు మారాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వ్యవసాయ విధానాల వైపు దృష్టి సారించి ఆదాయం పెంచుకోవాలన్నారు. అనంతపురం వంటి కరువు ప్రాంతాల్లో రైతులు ఉద్యాన పంటలు వైపుకు మారి అధిక ఆదాయం పొందుతున్నారన్నారు.జిల్లాలో ఒకప్పుడు పైభాగాన ఉన్న భూముల్లో కెసి చెరుకు ఫ్యాక్టరీ ఉన్నప్పుడు అందరూ రైతులు చెరుకు వేశారన్నారు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ పెంపకం వైపు దృష్టి సారించారన్నారు.ప్రభుత్వం కూడా పామ్ ఆయిల్ చెట్ల పెంపకం కోసం పలు పథకాల ద్వారా రాయితీలు అందిస్తోందన్నారు.
ఆయిల్ విత్తనాలను కొనుక్కునేందుకు పతంజలి కంపెనీ ఉందన్నారు. పండించిన ప్రతి ఆయిల్ గింజను కొనేందుకు చట్టం ఉందన్నారు మొదటి 4 సంవత్సరాలు ఆయిల్ పామ్ సాగులో రాబడి ఉండదని, ఆ తర్వాత సంవత్సరానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆదాయం పొందవచ్చన్నారు. అలాంటి పంటలు వేసుకుంటే రైతులు బాగా ఎదుగుతారన్నారు. అలాగే ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామం, మొవ్వ మండలం చిన్న ముత్తేవి గ్రామంలో ఉదయ్ ఆక్వా తో ఒప్పందం కుదుర్చుకొని కొందరు రైతులు 10 సెంట్ల భూమిలో కోరమేను సాగు చేస్తున్నారన్నారు.
ఇందుకోసం 5 సెంట్ల భూమిలో ట్యాంకు ఏర్పాటు చేసుకొని 1000 కొరమీను చేప పిల్లలను మొదటి 4 నెలలు అక్కడ పెంచుతారని, తదుపరి కుంటలోకి మార్చుకుని మరో 4 నెలలు ఉంచుతారన్నారు. అందులో 850 పిల్లలు బ్రతుకుతాయన్నారు. కొరమేను 300 రూపాయల నుండి 350 రూపాయల వరకు అమ్మకం ధర లభిస్తుందన్నారు.పీఎంఈజీపి పథకం కింద 35 శాతం రాయితీ ఉంటుందని, ప్రభుత్వమే దరఖాస్తులు స్వీకరించి రుణాలు కూడా మంజూరు చేయిస్తుందన్నారు. రైతులు ఆ దిశగా మొగ్గు చూపాలన్నారు.రాను రాను యూరియా వాడకం పెరుగుతోందని, దాంతో భూసారం తగ్గిపోతుందన్నారు.
రైతులు యూరియాతో పాటు కలుపు మందుల వాడకం తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్నారు.ఇటీవల వచ్చిన తుఫానులకు సాధారణంగా సాగుచేసిన పంటలు నీట మునిగి నష్టపోయారని, అదే సేంద్రియ వ్యవసాయంతో సాగుచేసిన పంటలు వరద నీరు తగ్గాక బ్రతికాయన్నారు. భవిష్యత్తులో ప్రజలు సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలను కొనుగోలు చేయుటకు ఆసక్తి చూపుతారన్నారు.వరి పంట వేసే ముందు పి ఎం జి ఎస్ పథకంలో భాగంగా 32 రకాల విత్తనపు బంతులు పొలాల్లో వేసి పండించాలని తద్వారా ఆ భూమిలో పోషకాలు, భూసారం పెరుగుతాయన్నారు.
ఆ ప్రకారం చేయడం వలన పెట్టుబడి ఖర్చులు 30 శాతం తగ్గడంతో పాటు రైతు ఆదాయము పెరుగుతుందన్నారు. వ్యవసాయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత దేశ భవిష్యత్తు వ్యవసాయ విద్యార్థులపై ఉందన్నారు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రయోగాత్మకంగా పంటల ఉత్పత్తికి కృషి చేయాలని, రైతుల్లో విశ్వాసం పెంపొందించాలని సూచించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ కృషి విజ్ఞాన కేంద్రంలోని పంటల ఉత్పత్తి, మొక్కల రక్షణ, ఉద్యాన పంటల పెంపకం పై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. తదుపరి కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో ఒక ఎకరా భూమిలో సేంద్రీయ పద్ధతులలో పండిస్తున్న ఎం టి యు 1318 వరి పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించి కేంద్రం సమన్వయకర్త డి సుధారాణి ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డి.సుధారాణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. పద్మావతి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, వ్యవసాయ శాఖ డిడి మనోహర్,ఎడి మణిదరు, ఎంపీడీవో సుబ్బారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చౌదరి బాబు, పలువురు రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.