కృష్ణాజిల్లా : కొడాలి : ఘంటసాల : THE DESK :
మేడూరు ఛానల్ నుంచి కొత్తపల్లి బ్రాంచి కాలువలోకి రొయ్యల ప్యాక్టరీ వారు అక్రమంగా ఏర్పాటు చేసిన తూమును తొలగించి మా పంటలను కాపాడాలని కోరుతూ ఘంటసాల మండలం తాడేపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఇరిగేషన్ ఏఈ ప్రసాద్ కు శుక్రవారం అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ.. కొడాలి – మొవ్వ గ్రామాల మధ్య రొయ్యల ప్యాక్టరీ నిర్మించారని, ప్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలు, ప్యాక్టరీ వారు పంట భూములకు అడ్డంగా నిర్మించిన రోడ్డు వలన కొత్తపల్లి బ్రాంచి కాలువ పరిధిలోని సుమారు 600 ఎకరాల ఆయకట్టు నీట మునగడమే కాక నీరు కలుషితం వలన పంటలు దిగుబడి తగ్గిపోతుందన్నారు.
అంతే కాక పశువులు కూడా తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.
ఫ్యాక్టరీ వారు కొడాలి నుంచి మొవ్వ జాతీయ రహదారి కింద నుంచి ఏర్పాటు చేసిన అక్రమ తూము వలన సాగునీటికి అడ్డుగా ఉండటమే కాక వ్యర్థ జలాలతో నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని, వరదలకు పంటలు మునిగిపోయాయని తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు.
స్పందించిన ఇరిగేషన్ ఏఈ ప్యాక్టరీ వారు ఏర్పాటు చేసిన తూము మా పరధిలోకి రాదని, పంటలు ముంపు సమస్య పరిష్కారానికి కాలువలోని తూటకాడ, గుర్రపుడెక్క తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ హామి ఇచ్చారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు యార్లగడ్డ వీరభద్రరావు, గొర్రెపాటి సురేష్, కాట్రగడ్డ వేణుగోపాలరావు, ఆచంట బసవేశ్వరరావు, మైనేని మధుసూధనరావు, కొసరాజు ప్రసాద్, కొనగంటి చిన్నబాబు, తుమ్మల ప్రసాద్, పలువురు రైతులు పాల్గొన్నారు.