The Desk…Gannavaram : ఇరిగేషన్ పనులు సత్వరమే పూర్తి చేయండి : ఎమ్మెల్యే యార్లగడ్డ

The Desk…Gannavaram : ఇరిగేషన్ పనులు సత్వరమే పూర్తి చేయండి : ఎమ్మెల్యే యార్లగడ్డ


కృష్ణాజిల్లా : గన్నవరం : ది డెస్క్ :

గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ పెండింగ్ పనులను, కొత్తగా మంజూరయిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో పలు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలోని కాలువల మరమ్మత్తులు చేపట్టేందుకు ఇప్పటినుంచి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఖరీఫ్ సాగుకు జూన్ మొదటి వారంలోనే ఏలూరు కాలువకు నీళ్లు విడుదల చేసేందుకు కాలువ మరమత్తు పనులను పూర్తి చేసి నీటి విడుదలకు సిద్ధం చేయాలని కోరారు.

ఈ సందర్బంగా ఇరిగేషన్ ఎస్ ఈ మోహన్ రావు మాట్లాడుతూ.. ఎనికే పాడు వద్ద బుడమేరు అండర్ టన్నెల్ ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యం ఉండగా బుడమేరు వరద నివారణకు దీనికి అదనంగా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో అండర్ టన్నెల్ నిర్మించనున్నామని ఈ పనులు ప్రారంభిస్తే జనవరి నుంచి జూన్ నెల వరకు ఆరు నెలల పాటు ఏలూరు కాలువ కు నీటి విడుదలను ఆపాల్సి ఉంటుందని తెలిపారు.

ఆరు నెలలపాటు ఏలూరు కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపి వేస్తే గన్నవరం నియోజకవర్గం తో పాటు ఏలూరు జిల్లాలోని కొన్ని మండలాల ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని యార్లగడ్డ అధికారులకు సూచించారు. అనంతరం గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్ రోడ్ విస్తరణ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డివిజన్ డియి గంగయ్య, ఏఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.