The Desk…Gannavaram/Tadepalli : గూగుల్ డేటా సెంటర్ తో 1.5 లక్షల ఉద్యోగాలకు అవకాశం : యార్లగడ్డ

The Desk…Gannavaram/Tadepalli : గూగుల్ డేటా సెంటర్ తో 1.5 లక్షల ఉద్యోగాలకు అవకాశం : యార్లగడ్డ

కృష్ణాజిల్లా : తాడేపల్లి /గన్నవరం : ది డెస్క్ :

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల 1.50 నుండి 1.80లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావ్ స్పష్టం చేశారు.

బుధవారం ఉదయం తాడేపల్లిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి అతిపెద్ద పెట్టుబడి విశాఖపట్నం వచ్చిందని, ఇక్కడ 15 మిలియన్ డాలర్ల ఖర్చుతో గూగుల్ డాటా కేంద్రం ఏర్పాటు చేస్తుందని, ఈ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్రానికి పెద్దసంఖ్యలో ఐటీ పరిశ్రమలు రానున్నాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాదులో 4.4 బిలియన్ డాలర్లతో అమెజాన్ వెబ్ సర్వీస్ ఏర్పాటుచేయగా 48 వేల మందికి ఉద్యోగాలు లభించాయని, మహారాష్ట్రలో 8.3 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన డేటా సెంటర్లో 81,300 మందికి ఉద్యోగాలు లభించాయని, ఈ లెక్కన చూస్తే 15.5 బిలియన్లతో విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా కేంద్రంలో 1.8 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

ఇక్కడ డాటా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుందని యార్లగడ్డ పేర్కొన్నారు. విశాఖలో డాటా కేంద్రం ఏర్పాటు చేయటం వైసిపి నాయకులకు మింగుడు పడటం లేదని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే ధ్యేయంగా వారి ప్రవర్తన ఉందని మండిపడ్డారు. గూగుల్ డేటా సెంటర్ అంటే అది కోళ్ల ఫారం షెడ్డు అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు గంట, అరగంట, గుడ్డు మంత్రులతో చంద్రబాబును లొకేష్ ను తిట్టించడమే ధ్యేయంగా పనిచేశారని ఇప్పుడు మళ్ళీ అదే మాజీ మంత్రులతో ఆరోపణలు, విమర్శలు చేయించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని వైసిపి నాయకులకు కడుపు మంటగా ఉందని విమర్శించారు.

మాజీ ఎంపీ వివరాలను గూగుల్ టేక్ అవుట్ ద్వారా సిబిఐ బయటకు తీయడంతో వైసిపి నాయకులకు గూగుల్ పట్ల విరక్తి భావంతో మాట్లాడుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేశారని, అదే మైక్రోసాఫ్ట్ వెండర్ షిప్ తీసుకుని ఉంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకు వేల కోట్ల ఆదాయం సమకూరేదన్నారు.

ఆయన రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉద్యోగాల కోసం హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయిస్తే నేడు దాదాపు పది లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేందుకు ఆ సంస్థ దోహద పడిందన్నారు. గూగుల్ టాటా సెంటర్ సెంటర్ ఏర్పాటుపై జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా యార్లగడ్డ డిమాండ్ చేశారు.

మీరు గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమలు తెస్తే మేము ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ తెచ్చామని ఛలోక్తులు విసిరారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజలపై గుడ్డు, గంట, అరగంట నాయకులు కాకుండా వైసీపీలోని ఐటి నిపుణులతో బహిరంగ చర్చకు తాను సిద్దమని యార్లగడ్డ సవాల్ విసిరారు.