ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
“సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎంపీ మహేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ఎన్టీఆర్ అధికార పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారని కొనియాడారు. కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ పాటుపడ్డారని ఎంపీ తెలిపారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తూ, ప్రజల ఆకాంక్షల మేరకు పథకాలు అమలు చేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.